అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం

అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం

అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. తొలి మానవ సహిత వాణిజ్య వ్యోమనౌక విజయవంతంగా నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రైవేట్ రాకెట్ తయారీ సంస్థ స్పేస్ ఎక్స్.. నలుగురు ఆస్ట్రోనాట్లను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది. నాసాతో కలిసి చేపట్టిన ఈ ప్రయోగానికి ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ వేదికైంది. ఆదివారం రాత్రి 7 గంటల 27 నిమిషాలకు ఫాల్కన్ రాకెట్‌లో వ్యోమగాముల బృందం అంతరిక్షంలోకి బయలుదేరింది. ఇంటర్నేషనల్ స్పేస్‌ సెంటర్‌కు చేరుకోవడానికి ఇరవై ఏడున్నర గంటల సమయం పట్టనుంది. ఈ ప్రయోగంతో రోదసిలోకి ప్రైవేటు ట్యాక్సీ సర్వీసులు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయి.

ఇది స్పేస్‌ఎక్స్‌ చేపట్టిన రెండో మానవసహిత అంతరిక్ష ప్రయోగం. మొదటి యాత్ర కేవలం ప్రయోగాత్మకంగానే జరిగింది. అయితే నాసాకు ఒక ప్రైవేటు కంపెనీ పూర్తిస్థాయి వాణిజ్య ట్యాక్సీ సర్వీసును అందించడం ఇదే తొలిసారి. వ్యోమగాముల్లో అమెరికాకు చెందిన కమాండర్‌ మైక్‌ హాప్కిన్స్‌, మహిళా వ్యోమగామి, భౌతిక శాస్త్రవేత్త షానన్‌ వాకర్‌, నౌకాదళ అధికారి విక్టర్‌ గ్లోవర్‌, జపాన్‌కు చెందిన సోయిచి ఉన్నారు. ఐదారు నెలలు వీరు ఐఎస్‌ఎస్‌లోనే ఉంటారు. వీరిలో విక్టర్‌ గ్లోవర్‌.. సుదీర్ఘ అంతరిక్ష యాత్రకు పయనమైన తొలి నల్లజాతి వ్యోమగామిగా గుర్తింపు పొందారు. 40 ఏళ్లలో మూడు రకాల వ్యోమనౌకల్లో ప్రయాణించిన తొలి వ్యక్తిగా నొగుచి రికార్డుకెక్కారు. గతంలో ఆయన అమెరికా స్పేస్‌ షటిల్‌, రష్యన్‌ సోయుజ్‌ వ్యోమనౌకల్లో ప్రయాణించారు.

ఈ సారి దూసుకెళ్లిన క్రూ డ్రాగన్‌ క్యాప్స్యూల్‌కు రెజీలియన్స్‌ అని పేరు పెట్టారు. కరోనా సహా ఈ ఏడాది అనేక సవాళ్లు తలెత్తిన నేపథ్యంలో ఈ పేరును ఖరారు చేశారు. రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లగానే కాలిఫోర్నియాలోని హాథ్రోన్‌లో ఉన్న స్పేస్‌ ఎక్స్‌ మిషన్‌ కంట్రోల్‌ కేంద్రంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ప్రయోగాన్ని చూసేందుకు భారీగా తరలివచ్చారు. కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నాసా అనేక జాగ్రత్తలను తీసుకుంది. వ్యోమగాములు, వారి కుటుంబాలు అక్టోబర్‌ నుంచి క్వారంటైన్‌లో ఉన్నారు. అటు కరోనా పరీక్షల్లో అయోమయం నెలకొన్న కారణంగా.. స్పేస్‌ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ ఈ ప్రయోగానికి దూరంగా ఉన్నారు. ఇదివరకు నిర్వహించిన నాలుగు కరోనా పరీక్షల్లో ఆయనకు రెండుసార్లు పాజిటివ్‌, రెండు సార్లు నెగెటివ్‌ వచ్చింది. దీంతో ప్రయోగాన్ని ఆయన దూరం నుంచే చూశారు.

2011లో స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ తర్వాత మళ్లీ ఇదే తొలిసారి కావడం విశేషం. ఆ ప్రయోగంలో డాగ్ హర్లే, బాబ్‌లను ఈ ఏడాది మే నెలలో స్పేస్ స్టేషన్‌కు నాసా పంపింది. అక్కడ వారు 63 రోజులు పాటు ఉండి.. ఆ తర్వాత ఆగష్టులో గల్ఫ్ ఆఫ్ మెక్సికో ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. ఇక తాజా ప్రయోగానికి వాతావరణం రూపంలో కొన్ని అడ్డంకులు ఎదురుకాగా.. ఆ తర్వాత అన్ని సెట్ కావడంతో మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది నాసా. త్వరలోనే వీరు ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ అవుతారని సమాచారం. తాజా ప్రయోగంతో త్వరలో ఎవరైనా టికెట్​ కొనుక్కొని అంతరిక్షంలోకి వెళ్లే చాన్స్​ రానుంది.

Tags

Read MoreRead Less
Next Story