పదో వసంతంలోకి తెలంగాణ.. మిన్నంటిన సంబరాలు

పదో వసంతంలోకి తెలంగాణ.. మిన్నంటిన సంబరాలు
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ఘనకీర్తి దశ దిశలా చాటేలా పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు జరగనున్నాయి

దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణ ముస్తాబయ్యింది. ఇవాళ్టితో తెలంగాణ రాష్ట్రం పదో వసంతంలోకి అడుగు పెడుతుంది. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటాలు, రాష్ట్ర అవతరణ అనంతరం జరిగిన అభివృద్ధి ప్రతిబింబించేలా దశాబ్ది ఉత్సావాలను నిర్వహిస్తోంది తెలంగాణ సర్కారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ఘనకీర్తి దశ దిశలా చాటేలా పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు జరగనున్నాయి. ఉదయం పది గంటల 20 నిమిషాలకు.. అసెంబ్లీ దగ్గర ఉన్న అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించనున్నారు కేసీఆర్. అక్కడి నుంచి సచివాలయం చేరుకుని.... 10గంటల 30 నిమిషాలకు జాతీయ జెండాను ఆవిష్కరించి... దశాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు వేడుకల్లో పాల్గొంటున్నారు. ఉదయం ఏడున్నర గంటలకే.. తమతమ కార్యాలయలపై జెండాను ఆవిష్కరిస్తారు.

ఇక... తెలంగాణ వ్యాప్తంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఇందు కోసం 105కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. ఇవాల్టి నుంచి 21 రోజుల పాటు అంగరంగ వైభవంగా.. వేడుకలు జరగనున్నాయి. పదేళ్ల తెలంగాణ సాధించిన పురోగతి అర్థం అయ్యేలా లోగో రూపొందించారు. తెలంగాణ తల్లి, బతుకమ్మ, బోనాలు, పాలపిట్ట, అమరవీరుల స్మారకం, కాళేశ్వరం, విద్యుత్తు, వ్యవసాయం, మిషన్ భగీరథ, సాంస్కృతిక, యాదాద్రి, మెట్రో రైలు, టీ-హబ్, అంబేద్కర్ సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతో పాటు పలు చిహ్నాలతో ఈ లోగో రూపొందించారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణలో భాగంగా అమరవీరులను స్మరించుకునేందుకు ప్రత్యేకంగా మార్టియర్స్ డే నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అమరుల స్థూపాలను అలంకరించి.. వారికి నివాళులు అర్పించనున్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి, అమరుల త్యాగాలను స్మరిస్తూ తుపాకీ పేల్చి గౌరవ వందనం సమర్పించనున్నారు పోలీసులు.

తెలంగాణ ప్రస్థానంపై డాక్యుమెంటరీ కూడా సిద్దం అయ్యింది. 2014 జూన్ 2 నుంచి 2023 జూన్ 2 వరకు సాగిన పాలన, సాధించిన ప్రగతితో ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. ఇక... రేపు తెలంగాణ రైతు దినోత్సవం, ఈ నెల 4న సురక్షదినోత్సవం, 5న విద్యుత్ విజయోత్సవం, 6న పారిశ్రామిక ప్రగతి ఉత్సవం, 7న తాగునీటి దినోత్సవం, 8న ఊరూరా చెరువుల పండగ, 9న సంక్షేమ సంబరాలు, 10న సుపరిపాలన దినోత్సవం, 11న తెలంగాణ సాహిత్య దినోత్సవం, 12న తెలంగాణ రన్ నిర్వహించనున్నారు. ఇలా 22వ తేదీ వరకు ప్రతి రోజు పండుగలా ఉత్సవాలు నిర్వహించేలా ప్లాన్ సిద్ధం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story