ఇంటి ముందు మూత్రవిసర్జన చేసిన యువకులు.. ఇదేంటని ప్రశ్నించిన ఇంటి యజమానిపై..

నల్గొండ జిల్లాలో పట్టపగలు తల్వార్లు పెట్టుకుని హల్‌చల్ చేశారు కొందరు యువకులు. చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన ఓ యువకుడు.. తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఫుల్లుగా మందు కొట్టి.. కారులో తిరుగుతూ ఊర్లో నానా రభస సృష్టించాడు. ఓ ఇంటి ముందు కారు ఆపి.. గేటు ముందు మూత్రవిసర్జన చేశాడు. ఇదేంటని ప్రశ్నించిన ఇంటి యజమానిపై.. తల్వార్‌తో దాడి చేసేందుకు ప్రయత్నించాడు.
ఒక్కసారిగా భయపడిపోయిన ఆ ఇంటి యజమాని.. చుట్టుపక్కల వాళ్లని పిలవడంతో కారులో పరారయ్యేందుకు ప్రయత్నించారు. గ్రామస్తులంతా కర్రలు తీసుకొని కిలోమీటరు దూరం వెంటపడ్డారు. భయపడిన ఆ యువకులు కారుని వేగంగా నడపడంతో అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. దీంతో రాళ్లు కర్రలతో కారుపై దాడి చేశారు గ్రామస్తులు.
విషయం తెలియడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న కత్తులు, తల్వార్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

