బండరాళ్ల మధ్య తలకిందులుగా ఇరుక్కున్న వ్యక్తి; రెండు రోజులుగా ప్రత్యక్ష నరకం

కామారెడ్డి :
ఎరక్కు పోయి ఇరుక్కుపోయాము అన్న నానుడికి అద్దం పట్టే ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. సరదాగా అడివిలో షికారుకు వెళదాం అనుకున్న ఓ యువకుడు అనుకోని విధంగా బండరాళ్ల మధ్య ఇరుక్కుని రెండు రోజులుగా నరకయాతన అనుభవిస్తున్నాడు. చేజారిన సెల్ ఫోన్ ను వెలికితీసే క్రమంలో తాను కూడా అవే రాళ్ల మధ్యలో తలకిందలుగా ఇరుక్కుపోయాడు.
కామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన షాడరాజు మంగళవారం సాయంత్రం మిత్రుడు మహేశ్ తో కలసి సరదాగా వేటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే కాసేపటికే రాజు చేతిలోని సెల్ ఫోన్ కిందకు జారి బండరాళ్ల మధ్య ఇరక్కుపోయింది. సెల్ ఫోన్ ను వెలికితీసే క్రమంలో అప్రయత్నంగానే రాజు కూడా అక్కడే ఇరుక్కుపోయాడు. ఓ చేయి, కాలు సహా శరీరం మొత్తం రాళ్ల మధ్య స్టక్ అయిపోయింది. అతడిని బయటకు లాగేందుకు స్నేహితుడు మహేశ్ విశ్వప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. తరువాత మహేశ్ ద్వారా సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని రాజును బయటకు తీసేందుకు ఒక రోజంతా శ్రమించారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు విషయం తెలియజేశారు.
రాజు, మహేశ్ వేటకోసమే అడివికి వచ్చారు అని పోలీసులకు తెలియకూడదన్న భయంతో విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడినప్పటికీ, సమయం గడిచే కొద్దీ రాజు ప్రాణాలకే ప్రమాదం అని నిశ్చయించుకుని చివరకు పోలీస్ కు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన రక్షక బృందం క్రేన్ ల సహాయంతో బండరాళ్లను తొలగించి రాజును వెలికితీసేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టారు. త్వరలోనే రాజును సురక్షితంగా బయటకు తీసుకువస్తామని పోలీస్ అధికారులు తెలియజేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com