బెట్టింగుల్లో గ్రేటర్‌ హైద్రా"బ్యాడ్‌"

బెట్టింగుల్లో గ్రేటర్‌ హైద్రాబ్యాడ్‌
నగరంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న రేసులు, కోడి పందేలు, క్యాసినో, క్రికెట్‌ బెట్టింగ్‌ సంసృతి

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఇక్కడ అంతా ఉరుకులు పరుగుల జీవితం. దేశ నలుమూలల నుంచి ఇక్కడ జీవనం కొనసాగిస్తుంటారు. భాగ్యనగరం పేరుకు తగ్గట్లే అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతూ దూసుకుపోతుంది. కళ్లున్నాయని అనందిచే లోపలే కన్నీళ్లు కూడా ఉన్నాయని గుర్తు చేసే చందానా ఇక్కడ వ్యసనాలు కూడా పెరిగిపోతున్నాయి. నగరంలో రేసులు, కోడి పందేలు, క్యాసినో, క్రికెట్‌ బెట్టింగ్‌ సంసృతి పెరిగిపోయి పేద, మధ్యతరగతి కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. వ్యసనానికి బానిసలై ఎంతోమంది రోడ్డున పడుతున్నారు.

వీకెండ్‌ లో కొన్ని ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌లు నగర శివారుల్లోని రిసార్ట్స్‌, ఫామ్‌హౌస్‌ల్లో స్పెషల్‌ ఈవెంట్లు ఏర్పాటు చేస్తున్నాయి. క్యాసినో, పేకాట కోసం రూమ్‌లలో కేటగిరీలను బట్టి స్పెషల్‌ ట్రిట్‌మెంట్లు అందిస్తూ ఆకర్షిస్తున్నారు. నగరంలోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో దాదాపు వంద నుంచి రెండు వందల కోట్లు చేతులు మారుతున్నాయని ఓ టాక్‌. అయితే అందులో జస్ట్ టెన్‌ పర్సెంట్‌ మాత్రమే పోలీసులకు దొరుకుతుంది. గతేడాది మూడు కమిషనరేట్ల పరిధిలో క్రికెట్‌ బెట్టింగ్‌, క్యాసినోలపై 798 కేసులు నమోదయ్యాయి. 3వేల588 మందిని అరెస్టు చేసి కేవలం10 కోట్లు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు కిట్టీపార్టీల పేరుతో గ్రేటర్‌లో గల్లీగల్లీలో పార్టీలు, వీకెండ్‌ పార్టీల ముసుగులో విచ్చలవిడిగా పేకాట స్థావరాలు నడుస్తున్నాయి. పాతిక వేల నుంచి రెండు లక్షల వరకు ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నారు. ఫారిన్‌ లిక్కర్‌ అన్‌లిమిటెడ్‌ ఫుడ్‌ ఫ్రీగా సప్లయ్‌ చేస్తారు. క్యాసినో, పేకాట కోసం ప్రత్యేకంగా కూపన్లు, కాయిన్స్‌ ఇస్తారు. రిసార్ట్స్‌లను బుక్‌ చేసి దందా సాగించే కొందరు నిర్వాహకులున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఈ ఈవెంట్లు జరుగుతున్నాయని సమాచారం.

ఇటు కొన్ని ఫామ్‌హౌస్‌ల్లో క్రికెట్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ జోరుగా సాగుతున్నాయి. గుజరాత్‌, రాజస్థాన్‌, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన బుకీలు సిటీలో ఫంటర్లను నియమించి, బిజీ సెంటర్లలలో అపార్ట్‌మెంట్స్‌, లాడ్జిల్లో ఫేక్‌ ఐడెంటీ కార్డులతో అద్దెకు తీసుకొని దందా సాగిస్తున్నారు. కొందరు సోషల్‌ మీడియాలో ఫేక్‌ బెట్టింగ్‌ స్క్రీన్‌షాట్లు పెట్టి మోసాలకు పాల్పడుతున్నారు. ఇదే తరహాలో నకిలీ పందేలతో లక్షలు కొట్టేసిన ముఠాను గతంలో ఎస్‌ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags

Next Story