కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుపై కాగ్ లోతు పరిశీలన

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుపై కాగ్ మరింత లోతుగా పరిశీలన చేయనుంది. గత ఏడాదిన్నరగా కాగ్ పలు రకాల సమాచారం అడగటం, క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించడం, నీటిపారుదల శాఖ అధికారులు వివరణ ఇవ్వడం జరుగుతుంది. తాజా తాజాగా కాగ్ ఉన్నతాధికారే నేరుగా పనులను పరిశీలించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లోని అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా పనిచేస్తున్న నిఖిల్ చక్రవర్తి 11వ తేదీన అన్నారం పంపుహౌస్, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించనున్నారు. ఈ మేరకు సంబంధిత చీఫ్ ఇంజినీర్‌కు, సూపరింటెండింగ్ ఇంజినీర్‌కు లేఖ రాశారు. ఇప్పటికే పలు దఫాల సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలు జరిగాయి. ఇక మూడోసారి పరిశీలనకు ఉన్నతస్థాయి అధికారి నేరుగా వస్తుండటం నీటిపారుదల శాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇక దీనికి ముందు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని కోరుతూ కాగ్ అధికారులు రెండు వేర్వేరు లేఖలు రాశారు. డిజైన్ల నుంచి పనుల వరకు అన్ని రకాల సమాచారాన్ని కోరారు. డిజైన్లలో మార్పులు చేసి ఉంటే ఆ వివరాలు కూడా ఇవ్వాలని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. టెండర్ల పరిశీలన డాక్యుమెంట్లు, డిజైన్లు, డ్రాయింగులు, పెరిగిన ధరల వివరాలు కోరారు. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి టెండర్ డాక్యుమెంట్లతోపాటు ఎన్‌ఐటీ, ఇంజినీరింగ్ రీసెర్చి ల్యాబొరేటరీ చేసిన అధ్యయనాలు కోరారు. ఇక డీజిల్, లేబర్, ఇతర మెటీరియల్, గేట్లకు సంబంధించిన ధరల వివరాలు కూడా చెప్పాలన్నారు. జీఎస్టీ, ఎం.బుక్, మొదట నిర్ణయించిన దానికి భిన్నంగా జరిగిన మార్పులతో పాటు పలు అంశాలపై వివరాలను కోరారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, మూడు లిప్టులకు సంబంధించి కూడా ఇదే సమాచారాన్ని కోరారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com