ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు: సీఎం కేసీఆర్

కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఖండించారు. ప్రధాని మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతుందని మండిపడ్డారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు, రాహుల్ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం మోదీ దురంహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అని తెలిపారు. రాజ్యాంగబద్ద సంస్థలను దురుపయోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంట్‌ను సైతం హేయమైన చర్యలకోసం మోదీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయమన కేసీఆర్ వెల్లడించారు.
ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించిందన్నారు. ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయింది. నేరస్తులు, దగాకోరుల కోసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ పతనాన్ని కొని తెచ్చుకుంటున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీల మధ్య వుండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్య వాదులందరూ ముక్తకంఠంతో ఖండించాలన్నారు. బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com