నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రాక..

ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. కొంతకాలంగా బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు మాటలతో కత్తులు దూసుకుంటున్నారు. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను ఈడీ విచారించడం, పదో తరగతి పేపర్ లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ్ని అరెస్టు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రధాని పర్యటన కాక రేపుతోంది. మోదీ రాక సందర్భంగా ఇప్పటికే బీఆర్‌ఎస్ నిరసనలకు పిలుపునివ్వడం.. మోదీని, బీజేపీని టార్గెట్ చేస్తూ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు పెట్టడం, సింగరేణి ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించడం అగ్గికి ఆజ్యం పోస్తోంది.
ఇక పరేడ్ గ్రౌండ్స్ సభలో మోదీ ఏం మాట్లాడుతారు? బీఆర్‌ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలేమైనా చేస్తారా? కేవలం కేంద్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, సాయం వంటి అంశాలకే పరిమితమవుతారా? అన్నదానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఏడాదిన్నర కాలంలో పలుమార్లు రాష్ట్రానికి వచ్చిన మోదీ.. కొన్ని సార్లు కేసీఆర్‌ను, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి నేరుగా.. మరికొన్ని సార్లు పరోక్షంగా విమర్శలు సంధించా రు. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ తీరుపై విమర్శలు చేస్తారా, లేక గతంలో తరహా పరోక్ష విమర్శలు చేస్తారా? బండి సంజయ్ అరెస్టు వంటి అంశాలను ప్రస్తావించి తప్పుపడతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
TSPSC పేపర్ లీకేజీ, ఢిల్లీ లిక్కర్ స్కాం అంశాలపై బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసి బీఆర్‌ఎస్ సర్కారును, కేసీఆర్ కుటుంబాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. బీఆర్‌ఎస్ కూడా దీటుగా స్పందించి ప్రత్యారోపణలకు దిగింది. ముఖ్యంగా టెన్త్ పేపర్ల లీక్ కేసులో బండి సంజయ్ అరెస్టు, రిమాండ్‌తో వేడి పెరిగిపోయింది. తాజాగా మోదీ పర్యటన సందర్భంగా సింగరేణి ప్రైవేటీకరణ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి అటు కేంద్రాన్ని, ఇటు బీజేపీని ఇరుకున పెట్టేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. పార్టీ శ్రేణుల్లో దూకుడు పెంచేందుకు కేసీఆర్ సహా కీలక నేతలంతా ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రధాని పర్యటనను విజయవంతం చేసి.. పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com