బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం.. వాళ్లిద్దరూ సస్పెండ్

బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకొంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ ఇద్దరు నేతలు పార్టీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గతకొద్ది రోజులుగా జూపల్లి, పొంగులేటి.. బీఆర్‌ఎస్, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.ఖమ్మంలో తనవర్గం నేతలతో పొంగు లేటి భేటి అవుతున్నారు. కొత్తగూడెంలోనిర్వహించిన పొంగులేటి శ్రీనివాస్ ఆత్మీయ సమావేశంలోనూ జూపల్లి కృష్ణారావు కూడా పాల్గొన్నారు.సీఎం కేసీఆర్ టార్గెట్‌గా విమర్శలు ఎక్కుపెట్టడం రాజకీయ వేడి రగిలించింది.
ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్ మరోసారి సీఎం కావాలని కలలు కంటున్నారని.. కానీ అది సాధ్యం కాదన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కుటుంబ స్వార్థానికి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి అవుదామనుకుంటున్నారని.. అది పగటి కలేనంటూ విమర్శించారు. సింగరేణిని అప్పుల కుప్పగా మార్చారని, కార్మికులను అవమానించారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం, దాన్ని నడిపిస్తున్న సీఎం ఎనిమిదిన్నరేళ్ల కాలంలో చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదన్నారు.
ఎందరో అమరుల ప్రాణ త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణను సీఎం కేసీఆర్ తాకట్టు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు జూపల్లి కృష్ణారావు.అసంపూర్తి పథకాలు, నెరవేరని హామీలతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు. తిండి లేకపోయినా ఫర్వాలేదని, ప్రజల ఆత్మాభిమానం దెబ్బతింటే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే జరుగుతోందన్నారు. తెలంగాణలో పాలన ఎప్పుడో గాడి తప్పిందని.. BRS పేరుతో చెత్త పాలనను దేశానికి ఇవ్వాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com