బీఆర్‌ఎస్ భూకబ్జాలను బయటపెడుతున్న రేవంత్‌రెడ్డి

పేపర్ లీకేజీ, లిక్కర్ కేసు లో కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేసిన తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు మరో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. హైదరాబాద్ చుట్టుపక్కల జరిగిన భూ అక్రమాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. వేల కోట్ల విలువైన భూములను కేసీఆర్ ప్రభుత్వం తన అనుయాయులకు కారు చౌకగా కట్టబెడుతుందని ఆరోపిస్తోంది. కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా ఆధారాలను సైతం బయటపెడుతోంది. ఇందులో భాగంగా హెటిరో డ్రగ్స్ అధినేత, టీఆర్ఎస్ రాజ్య సభ ఎంపి పార్ధసారధి రెడ్డి కి ప్రభుత్వం కారు చౌకగా కేటాయించిన 15 ఎకరాల అంశాన్ని లేవెనెత్తారు రేవంత్ రెడ్డి.
నిబంధనలకు విరుద్ధంగా పార్థసారథి రెడ్డికి చెందిన సాయి సింధు సంస్థకు హైటెక్ సిటీ దగ్గరలో 15 ఎకరాలు కేటాయించినట్లు ఆరోపించారు. 60ఏళ్ల లీజు కోసం ఏటా ప్రభుత్వం పార్థసారథి రెడ్డి నుంచి 50 కోట్లు వసూలు చేయాలన్నారు. ఇదొక్కటే కాకుండా వేల ఎకరాలను కారు చౌకగా కేసీఆర్ కట్టబెట్టిన ఆదారాలు తన వద్ద ఉన్నాయన్నారు రేవంత్ రెడ్డి. ముగ్గురు కలెక్టర్లు, నలుగురు ఉన్నతాధికారులు కేసీఆర్ అక్రమాలకు సహకరిస్తున్నారన్నారు. ఈ భూ అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మొత్తానికి భూఅక్రమాలపై సీబీఐని ఎంటర్ చేయాలనేది హస్తం నేతల వ్యూహంగా కనిపిస్తోంది. మరి ఈ ఇష్యూపై కేసీఆర్ సర్కార్ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com