డెకాయిట్ గ్యాంగ్ అరెస్ట్..మూడు పిస్టల్స్ ఆరు బుల్లెట్లు స్వాధీనం

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డెకాయిట్ గ్యాంగ్ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. పుణెకు చెందిన అంతర్రాష్ట్ర ముఠాలోని ఐదుగురు సభ్యులను అదుపులోకి తీసుకుని.. మూడు కంట్రీమేడ్ పిస్టల్స్.. ఆరు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. పుణె నుంచి రైల్ మార్గాన వచ్చిన ముఠా సభ్యులు.. పోలీసులకు అనుమానం రాకుండా జీడిమెట్లలోని ఓ నిర్మాణంలో ఉన్న భవనంలో షెల్టర్ తీసుకున్నారు. బంగారు దుకాణాలను దోచుకోవడమే టార్గెట్‌గా నగరానికి వచ్చిన ఈ క్రిమినల్స్… చోరీ చేసేందుకు రెక్కీ కూడా నిర్వహించారు. దోచుకున్న తర్వాత పారిపోయేందుకు సంగారెడ్డిలో ఓ టాటా ఏస్ వాహనాన్ని చోరీ చేశారు. అటు.. మహారాష్ట్రలో చోరీకి పాల్పడ్డ బంగారాన్ని హైదరాబాద్‌లో విక్రయించి.. లక్షల్లో సొమ్ము చేసుకున్నారు.
పక్కా సమాచారంతో దాడి చేసి డెకాయిట్ గ్యాంగ్ సభ్యుల్ని అదుపులోకి తీసుకున్నామన్నారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. ఈ ఐదుగురు.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అని.. ఈ ముఠాపై మహారాష్ట్రలో 175కు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ ముఠా అరెస్ట్‌తో నగరంలో సెన్సేషన్ కేసులు నమోదు కాకుండా అరికట్టామన్న సీపీ స్టీఫెన్ రవీంద్ర… వీరిపై పీడీ యాక్ట్ కింద కేసులు పెడతామని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com