తెలంగాణపై ప్రియాంక గాంధీ ఫోకస్

తెలంగాణపై ప్రియాంక గాంధీ ఫోకస్

తెలంగాణ కాంగ్రెస్‌పై ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలు సందర్భాల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఢిల్లీ పిలిపించుకొని సమావేశాలు నిర్వహించిన ప్రియాంకా.. ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగబోతున్నారు. మే మొదటి వారంలో తెలంగాణలో కాలు మోపబోతున్నారు. తెలంగాణలో ప్రియాంకా గాంధీ తొలి పర్యటన కోసం పీసీసీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించే నిరుద్యోగ నిరసన బహిరంగ సభలో ప్రియాంకా గాంధీ పాల్గొననున్నారు. ఈ బహిరంగ సభ ద్వారా టీ.కాంగ్రెస్ గులాబీ సర్కార్ పై సమరశంఖం పూరించేందుకు రెడీ అవుతోంది. ఈ సభ ప్రియాంకా గాంధీ చేత నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. TSPSC పేపర్ లీక్ వ్యవహారం .. 10వ తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ అంశాన్ని ప్రియాంకా గాంధీ సభ ద్వారా జాతీయ స్థాయిలో ఫోకస్ చేసేందుకు హస్తం నేతలు సిద్దం అవుతున్నారు.


ఇక తొలిసారి రాష్ట్రానికి వస్తున్న ప్రియాంక గాంధీ సభలో భారీగా చేరికలకు ప్లాన్ చేస్తోంది పీసీసీ. భారీ జన సమీకరణతోపాటు ఇతర పార్టీల నుంచి వచ్చే ముఖ్య నాయకులను ప్రియాంక గాంధీ సమక్షంలో పార్టీలో చేర్చుకోవడం ద్వారా... ఆమె టూర్ కు భారీగా హైప్ క్రియేట్ చేసేందుకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఆ పార్టీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు లు ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇక వీరిద్దరితో పాటు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి ఆయన కుమారుడు రాజేష్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరెందుకు రెడీ అవుతున్నారు. వారి చేరిక అంశంపై ఇప్పటికే మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డితో పార్టీ హైకమాండ్ చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. నాగర్ కర్నూల్ టికెట్ ఆశిస్తున్న కూచుకుళ్ళ రాజేష్ రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకునేందుకు నాగం జనార్దన్ రెడ్డి సమ్మతి తప్పనిసరి అని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తుంది. ఇద్దరూ కలిసి పని చేస్తేనే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని ఓడించడం సాధ్యం అవుతుందని భావనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు.


మొత్తానికి ప్రియాంక గాంధీ తొలి పర్యటనలో.. భారీగా స్వాగతం పలకడంతో పాటు.. భారీ బహిరంగ సభను సక్సెస్‌ చేసేందుకు పీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. అధికార పార్టీలోని నాయకులను చేర్చుకోవడం ద్వారా పొలిటికల్ హైప్ క్రియేట్ చేసేలా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ప్రియాంక టూర్లో అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగేలా పక్కా స్కెచ్ తో అడుగులు వేస్తున్నారు హస్తం నేతలు.


Tags

Read MoreRead Less
Next Story