రేవంత్ కంటతడి.. తుదిశ్వాస విడిచే వరకు రాజీపడే ప్రసక్తే లేదు

రేవంత్ కంటతడి.. తుదిశ్వాస విడిచే వరకు రాజీపడే ప్రసక్తే లేదు
కాంగ్రెస్‌కు కేసీఆర్‌ 25 కోట్లుఇచ్చారంటూ ఈటల చేసిన వ్యాఖ్యల్ని రేవంత్‌ తీవ్రంగా తప్పుబట్టారు

తనపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ చేసిన ఆరోపణల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఛార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్‌ నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా తన కుటుంబం మొత్తం సర్వనాశనమై పోతుందన్నారు. కాంగ్రెస్‌కు కేసీఆర్‌ 25 కోట్లుఇచ్చారంటూ ఈటల చేసిన వ్యాఖ్యల్ని రేవంత్‌ తీవ్రంగా తప్పుబట్టారు. కేసీఆర్‌తో లాలూచీ తన రక్తంలోనే లేదని.. తుదిశ్వాస విడిచే వరకు రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పంచ్ డైలాగులతో ప్రత్యర్థులకు సవాల్ విసిరే రేవంత్ రెడ్డి కంటతడి పెట్టారు. కేసీఆర్ కుటుంబంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న తన నిజాయితీని శంఖించారంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రాణం ఉన్నంత వరకూ కేసీఆర్‌తో పోరాడుతానని రేవంత్‌ ఉద్వేగంగా మాట్లాడారు.

రేవంత్‌ రెడ్డి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేసినా కూడా సద్దుమణగడం లేదు. రేవంత్‌ రెడ్డి సవాల్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల స్పందించారు. తగిన సమయంలో జవాబిస్తానని వెల్లడించారు. దేవుళ్లపై ప్రమాణం చేసే సంప్రదాయాన్ని తాను పాటించడం లేదన్నారు. వ్యక్తిగతంగా తాను ఎవరినీ కించపరచ లేదన్నారు. తనకు కూడా ఆత్మవిశ్వాసం ఉందని.. అమ్మవారి మీదనో, తల్లి మీదనో ఒట్టేసే అవసరం తనకు లేదని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story