Yadadri : అక్రమాలకు తెరలేపిన మోత్కూరు ఇన్‌ఛార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌

Yadadri : అక్రమాలకు తెరలేపిన మోత్కూరు ఇన్‌ఛార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఇన్‌ఛార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ చెలరేగిపోయాడు. ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ సెలవుపై వెళ్తూ.. సబార్డినేట్‌కు ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలను అప్పగిoచాడు. సీన్ కట్ చేస్తే.. గంటల వ్యవధిలో ఊహించని రీతిలో అక్రమాలకు తెరలేపారు. ఏకంగా.. అక్రమ లే అవుట్ లకు సంబంధించిన 66 ప్లాట్ల డాక్యుమెంట్లను... నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశాడు. సెలవుపై వెళ్ళిన రిజిస్ట్రార్ తిరిగి విధుల్లోకి వచ్చి చూడగా బండారం బట్టబయలైంది. ఉన్నతధికారుల ఆదేశాలతో.. ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ తనిఖీ చేయడంతో అక్రమాల బాగోతం బయటపడింది.

మోత్కూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ లేఔట్లకు సంబంధించిన ప్లాట్లను.. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మోత్కూరు సబ్ రిజిస్ట్రార్‌.. సురేందర్ నాయక్ మార్చి 7 నుంచి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఆయన స్థానంలో జూనియర్ అసిస్టెంట్ ఇర్షాద్‌కు ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు ఇచ్చారు. ఈ నెల 21న ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఇర్షాద్ ఐదు రిజిస్ట్రేషన్లు చేశారు. నాలుగు గంటల తర్వాత రిజిస్ట్రేషన్లు వచ్చేలా లేకపోవడం, ఈ నెల 22న రంజాన్ పండుగ ఉండటంతో.. ఇర్షాద్ జిల్లా రిజిస్ట్రార్ అనుమతి తీసుకుని.. గంట పాటు చూసుకోమని మరో జూనియర్ అసిస్టెంట్ సుధీర్‌కు అప్పగించి వెళ్లారు. సాయంత్రం 5 గంటల తర్వాత.. కార్యాలయంలోని ఒకరిద్దరు ఉద్యోగులు ఇంటికి వెళ్లాక.. ఇన్‌ఛార్జ్‌ సబ్ రిజిస్ట్రార్ బాధ్యతల్లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ సుధీర్ సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆఫీసులోనే ఉండి.. ఏకంగా 66 ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేశాడట. అవన్నీ గతంలో సబ్ రిజిస్ట్రార్ తిరస్కరించినవి, పెండింగ్‌లో ఉంచిన అక్రమ లే అవుట్లకు సంబంధించినవే.. ఈ వ్యవహారంలో.. రియల్టర్ల నుంచి లక్షలు చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈనెల 22న రంజాన్.., 23న ఆదివారం సెలవు కాగా.. ఇన్‌ఛార్జ్‌ సబ్ రిజిస్ట్రార్‌ ఇర్షాద్ 24 తేదీన తిరిగి తన విధులకు హాజరయ్యారు. ఆరోజు.. తాత్కాలిక బాధ్యతలు నిర్వహించిన సుధీర్ కార్యాలయానికి రాలేదు. ఈ నెల 21న తాను ఇంటికి వెళ్లాక పెద్దఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగినట్టు గుర్తించిన ఇర్షాద్.. విషయాన్ని జిల్లా రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. ఆయన ఈనెల 25న కార్యాలయానికి వచ్చి తనిఖీ చేశారు. ఆ సమయంలో సుధీర్‌కు ఫోన్ చేసినా.. స్పందించలేదట. సోమవారం నుంచి నిన్నటి వరకు విధులకు హాజరుకాలేదు. అక్రమంగా రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్లను రద్దు చేసి, ఆ ఉద్యోగిని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. అయితే.. ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేసిన విషయం తెలిస్తే బాధితులు ఆందోళన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మోత్కూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఉన్నతాధికారి విచారణకు వస్తున్నారని తెలియడంతో.. 66 డాక్యుమెంట్లను మాయం చేసినట్లు గుర్తించారు. జూనియర్ అసిస్టెంట్ సుధీర్ ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story