నూతన సచివాలయం రేపే ప్రారంభం.. కేసీఆర్‌ సర్కార్‌ కీలక నిర్ణయం

నూతన  సచివాలయం రేపే ప్రారంభం.. కేసీఆర్‌ సర్కార్‌ కీలక నిర్ణయం
ఆయా వర్గాలకు మేలు చేసే పలు ప్రతిపాదనల దస్త్రాలపై సీఎం కేసీఆర్‌ సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది

తెలంగాణ సచివాలయ నూతన భవనం రేపు ప్రారంభోత్సవం కానుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలపై కీలక నిర్ణయాలు వెలువరించనుంది. ఆయా వర్గాలకు మేలు చేసే పలు ప్రతిపాదనల దస్త్రాలపై సీఎం కేసీఆర్‌ సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమివ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ వసతిగృహాలు, గురుకుల విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలలు, మోడల్‌ పాఠశాలలు, కస్తూర్బా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు డైట్‌ ఛార్జీల పెంపు దస్త్రంపై ముఖ్యమంత్రి సంతకం చేయనున్నారు. దాదాపు 30 లక్షల మంది విద్యార్థులకు మేలు జరిగేలా డైట్‌ ఛార్జీలు 25 శాతం పెంచాలని మంత్రుల కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆమోదించింది. వసతిగృహాలు, గురుకులాల్లో చదివే 3-7 తరగతి విద్యార్థులకు నెలకు 950 నుంచి రూ.12వందల రూపాయలు, 8-10 తరగతి విద్యార్థులకు 11వందల నుంచి 14వందల రూపాయలు, పది.. ఆపై తరగతుల వారికి 15వందల నుంచి 18వందల 75 రూపాయల చొప్పున డైట్‌ ఛార్జీలు పెంచాలని నిర్ణయించింది.

ఈ పెంపు 2023-24 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి వచ్చేలా సంక్షేమశాఖలు సీఎంకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపాయి. డైట్‌ ఛార్జీల పెంపు ద్వారా ప్రభుత్వం ఏటా 350 కోట్లు అదనంగా వెచ్చించనుంది. డైట్‌ ఛార్జీలను పెంచితే ఇంటర్‌.. ఆపై కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఉపకార వేతనాలు పెంచాల్సి ఉంటుంది. దీనికి ఏటా 200 కోట్ల వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. దళితబంధు పథకం రెండోవిడత విధివిధానాలనూ సీఎం ఆమోదించనున్నారు. నియోజకవర్గానికి 15వందల మందికి చొప్పున పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం బడ్జెట్‌లో 17 వేల కోట్లు కేటాయించింది. వివిధ వర్గాల విద్యార్థులకు విదేశీ విద్యాపథకం కింద నిధులు మంజూరు చేయనున్నారు. పేదల కోసం గతంలో సమీకరించిన స్థలాలు పంపిణీ చేసేందుకు, హైదరాబాద్‌లో నోటరీ భూముల క్రమబద్ధీకరణకు విధివిధానాలపై సంతకం చేస్తానని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. గృహలక్ష్మి పథకం విధివిధానాల రూపకల్పనకూ ఆదేశించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story