హైదరాబాద్‌లో జోరువాన..లోతట్టు ప్రాంతాలు జలమయం

హైదరాబాద్‌లో జోరువాన..లోతట్టు ప్రాంతాలు   జలమయం
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది

హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం దంచికొట్టింది. తెల్లవారుజామున ఈదురుగాలులు, ఉరుములతో విరుచుకుపడింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, ముషీరాబాద్, మణికొండ, మాదాపూర్, శేరిలింగంపల్లి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్‌, ఎస్‌ఆర్ నగర్‌లో కుండపోత వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వర్షపు నీరు నిలవడంతో చెరువులను తలపించాయి. మోకాళ్ల నీటితో ప్రజలు అవస్థలు పడ్డారు. నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ నిలిచింది. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్‌ సహా ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

హైదరాబాద్‌ అంబర్‌పేట్, నల్లకుంట, కాచిగూడ, చిక్కడపల్లి, నారాయణగూడ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అంబర్‌పేట్‌లోని పలు బస్తీలలోని ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శేరిలింగంపల్లి రైల్వే బ్రిడ్జి కింద భారీగా నీరు చేరింది. దాంతో ఆర్టీసీ బస్సులు, వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లింగంపల్లి నుంచి మైదిపట్నం వెళ్లే వాహనాలను నల్లగుండ్ల ఫ్లైఓవర్‌పై నుండి దారి మళ్లిస్తున్నారు. దాంతో ట్రాఫిక్ స్తంభించింది.

అటు ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షానికి గ్రేటర్‌ హైదరాబాద్‌లో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా అంబర్‌పేట్‌లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. శేరిలింగంపల్లి కాజాగూడలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూబ్లీహిల్స్, ముషీరాబాద్‌ ప్రాంతాల్లో 6 సెంటీమీటర్లు, ఉప్పల్, గోషామహల్, సికింద్రాబాద్, బేగంపేట్, మల్కాజ్‌గిరి, ఖైరతాబాద్, మెహదీపట్నం ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. మరో రెండు, మూడు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దాంతో జీహెచ్‌ఎంసీ అలర్ట్ అయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story