రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్  శుభాకాంక్షలు
డాక్టర్‌ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు

డాక్టర్‌ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనేక అపోహలు, ఎన్నో విమర్శలు, అడ్డంకులను దాటుకుని దృఢ సంకల్పంతో ప్రారంభమైన నూతన సచివాలయ నిర్మాణం, అనతి కాలంలోనే పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గొప్ప సాంకేతిక విలువలు, నిర్మాణ కౌశలంతో సెక్రటేరియట్ నిర్మాణం జరిగిందన్నారు.

అన్ని రకాల ప్రమాణాలను పాటిస్తూ.. దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ అనుకూల మహాద్భుత కట్టడమని పేర్కొన్నారు. ఒక రాష్ట్ర సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టడం దేశంలోనే మొదటిసారి అని తెలిపారు సీఎం కేసీఆర్‌. అంబేడ్కర్ మహాశయుని పేరు పెట్టుకోవడం వెనక సామాజిక, ఆర్థిక, రాజకీయ సాంస్కృతిక రంగాల్లో అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు దక్కాలనే సమున్నత లక్ష్యం ఉందన్నారు. ఎదురుగా తెలంగాణ అమరుల స్మారక జ్యోతి, పక్కనే ఆకాశమంత ఎత్తున అంబేడ్కర్ విగ్రహం దిక్సూచిగా నిలుస్తోందన్నారు.

దేశంలో అత్యంత చిన్న వయసున్న రాష్ట్రంగా తెలంగాణ సకల జనుల సంక్షేమ పాలనతో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అనతికాలంలోనే దేశానికే తెలంగాణ పాలన ఒక మోడల్‌గా నిలిచిందన్నారు. తెలంగాణ ప్రభ దేదీప్యమానమయ్యేలా.. దార్శనికతతో సాధించిన ప్రగతి వెలుగుల దారిలో, ప్రస్థానం మహోన్నతంగా కొనసాగుతుందని ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సెక్రటేరియట్‌ను అత్యంత గొప్పగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కర్నీ పేరు పేరునా అభినందించారు.

Tags

Next Story