నేటి నుంచే నూతన సచివాలయంలో పాలన

నేటి నుంచే నూతన సచివాలయంలో పాలన
మధ్యాహ్నం ఒంటి గంట 20 నుంచి ఒంటి గంట 33 నిమిషాల మధ్యలో 6వ అంతస్తులోని తన ఛాంబర్‌లో సీఎం కేసీఆర్ కొలువుదీరనున్నారు

నేటి నుంచి తెలంగాణ నూతన సచివాలయం నుంచి పాలన అధికారికంగా మొదలు కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట 20 నుంచి ఒంటి గంట 33 నిమిషాల మధ్యలో 6వ అంతస్తులోని తన ఛాంబర్‌లో సీఎం కేసీఆర్ కొలువుదీరనున్నారు. అలాగే మధ్యాహ్నం 1.30 నుంచి 3.20 వరకు ఛాంబర్లలో మంత్రలు ఆసీనులు కానున్నారు. ఆ తర్వాత సంక్షేమవర్గాలు, పేదలకు మేలు జరిగేలా పలు దస్త్రాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు సంతకాలు చేయనున్నారు.

దళితబంధు రెండోవిడత కింద 2023-24 ఏడాదికి నియోజకవర్గానికి 1100 మంది చొప్పున లబ్ధిదారులకు 10 లక్షల రూపాయలు పంపిణీ చేసే ఫైల్‌పై సీఎం కేసీఆర్ తొలి సంతకం చేయనున్నారు. ఇప్పటికే మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఆమోద్రముద్ర వేశారు. హుజూరాబాద్‌ మినహా 118 నియోజకవర్గాల్లో 1100 మందికి చొప్పున లబ్ధి చేకూరనుంది.

అటు హైదరాబాద్‌లో లక్ష మందికి డబుల్‌ బెడ్‌రూం గృహాల పంపిణీకి మార్గదర్శకాలపై మంత్రి కేటీఆర్ తొలి సంతకం చేయనున్నారు. అలాగే గిరిజన సంక్షేమశాఖ పరిధిలో పోడు భూములకు పట్టాల పంపిణీకి ఆమోదం లభించే అవకాశం ఉంది. పోడు దరఖాస్తులను పరిశీలించిన జిల్లా కమిటీలు తొలివిడత కింద నాలుగు లక్షల ఎకరాల అటవీ భూమిపై 1.55 లక్షల మంది గిరిజనులకు హక్కుపత్రాలను ప్రభుత్వం ఇప్పటికే ముద్రించింది. పోడు భూములకు పట్టాల పంపిణీ తేదీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఎస్సీ సంక్షేమశాఖ పరిధిలో కార్పొరేషన్‌ రుణాలకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికపై ఆ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సంతకం చేయనున్నారు.

మరోవైపు బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ల పరిధిలో స్వయం ఉపాధి రుణాల మంజూరుకు రంగం సిద్ధమైంది. ఈ రెండు కార్పొరేషన్ల కింద 600 కోట్ల రూపాయలతో కార్యాచరణ ప్రణాళికను ఆమోదించే అవకాశం ఉంది. అలాగే అంగన్‌వాడీ కేంద్రాల్లో 1-3 ఏళ్లలోపు చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు పాలు అందించేలా మహిళా శిశు సంక్షేమశాఖ నిర్ణయం తీసుకోనుంది. అంగన్‌వాడీల సిబ్బందికి పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలుగా నిర్ణయించడంతో పాటు మినీ అంగన్‌వాడీలను అప్‌గ్రేడ్‌ చేసే అంశాన్ని కూడా మహిళా శిశు సంక్షేమశాఖ పరిశీలిస్తోంది. ఇక కార్మికశాఖ పరిధిలో పలు సంక్షేమ పథకాలను విస్తరించే ప్రతిపాదనలను కార్మికశాఖ పరిశీలిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story