TS : సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.. ఆయన రాసిన లేఖలో ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు.. మీ ప్రభుత్వంలో జూనియర్ పంచాయితీ కార్యదర్శుల పరిస్థితి బానిసల కంటే హీనంగా తయారైందన్నారు.. గొడ్డు చాకిరీ చేయించుకోవడమే తప్ప, వారి హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. న్యాయంగా వారికి దక్కాల్సిన హక్కు అయిన ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని 12 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అయిన లేదన్నారు.. ఎంత సేపూ రాజకీయాలే తప్ప జూనియర్ పంచాయితీ కార్యదర్శుల గోడు పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శించారు రేవంత్ రెడ్డి.
రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మా పంచాయితీలు ఆదర్శం అందుకే కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తుందని గొప్పలు చెప్పుకుంటోందని... ఆ గొప్పల వెనుక జూనియర్ పంచాయితీ కార్యదర్శులు పడిన శ్రమ ఉందని అన్నారు.. వారి కష్టంతో రాష్ట్రంలో గ్రామపంచాయితీలకు 79 అవార్డులు వచ్చిన విషయాన్ని మరిచిపోవద్దన్నారు. ఇంత చేసి మీకు అవార్డులు తెస్తే వారి సర్వీసులను రెగ్యులర్ చేయకుండా వేధించడం ఎంత వరకు సహేతుకమని ప్రశ్నించారు. వారి కష్టానికి మీ ప్రభుత్వం ఇచ్చే రివార్డు ఇదేనా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సమస్యలను సావధానంగా విని పరిష్కరించాల్సిన ప్రభుత్వమే సమ్మె విరమించి ఉద్యోగాల్లో చేరకుంటే తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడటం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకే దిక్కులేకపోతే రాష్ట్రంలో పాలన ఉన్నట్టా లేనట్టా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.. ఇప్పటికైనా పంచాయితీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని.. లేకుంటే వారి పోరాటానికి కాంగ్రెస్ మద్దతుగా నిలిచి ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతుందని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com