TS : పెట్టుబడులే లక్ష్యంగా లండన్ లో మంత్రి కేటీఆర్

TS : పెట్టుబడులే లక్ష్యంగా లండన్ లో మంత్రి కేటీఆర్
X

లండన్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అక్కడి ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. తెలంగాణలో పెట్టుబడి అవకాశాల గురించి సమావేశానికి హాజరైన పలు కంపెనీల ప్రతినిధులకు వివరించారు. అనంతరం లండన్‌లోని భారత హై కమిషనర్ విక్రం కె. దురై స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్ మెంట్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గదామమని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక సమస్యలన్నింటి పైన దృష్టి సారించి, వాటి పరిష్కారానికి ప్రయత్నించామన్నారు. ఇన్నోవేషన్, మౌలిక వసతుల సదుపాయాల కల్పన వంటి అంశాలపైన 9 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి వ్యవసాయ, ఐటీ రంగాల నుంచి మొదలుకొని అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధ్యమైందన్నారు. ఇక రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగవంతమయిందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ విండో అనుమతుల విధానం గురించి ప్రత్యేకంగా మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. అత్యంత వేగంగా, పారదర్శకంగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే ఈ విధానం ఇప్పటికే ఎన్నో ప్రశంసలను అందుకుందని, ఫలితాలను ఇచ్చిందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో టెక్నాలజీ ఆధారిత కంపెనీల పెరుగుదల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. తమ ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారాలు అందిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు.

Tags

Next Story