తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
X

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారిపోతున్నాయి. భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం ఏడు దాటితే భయటకు రావాలంటేనే భయంతో జంకుతున్నారు. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో అయితే ఏకంగా 50 డిగ్రీల మార్క్‌కు చేరువ అయ్యాయి ఉష్ణోగ్రతలు. రాజమండ్రిలో అత్యధికంగా 49డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం కలవర పెడుతోంది. మరోవైపు ఏలూరులో 48 డిగ్రీలు, గుంటూరు, చిలకలూరిపేటలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరోవైపు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కొత్తగూడెం, మిర్యాలగూడెలో ఏకంగా 47 డిగ్రీల మార్క్‌ను చేరుకున్నాయి ఉష్ణోగ్రతలు. ఇక పాల్వంచ 46, నల్గొండ, ములుగులో 45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు కాగా, వరంగల్ 43, నిర్మల్, మంచిర్యాలలో 42 డిగ్రీలు నమోదయినట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌లో సైతం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూర్యభగవానుడి ప్రతాపంతో జనం బయటకు రావాలంటనే భయంతో వణికిపోతున్నారు. వేసవి తీవ్రతతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. మరోవైపు ఉక్కపోతతో నరగవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేసవితాపం నుంచి బయటపడేందుకు కొబ్బరి నీళ్లు, పుచ్చకాయలతో పాటు కూల్‌డ్రింక్స్‌ వైపు జనం మొగ్గు చూపుతున్నారు. మరో రెండ్రోజుల పాటు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక ఎండల ప్రభావంతో పలు రకాల చర్మవ్యాధులు వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు చెప్తున్నారు.

Tags

Next Story