బండికి ఢిల్లీ నుంచి పిలుపు..తెలంగాణ బీజేపీని గాడిన పెట్టేందుకే..!

కర్నాటక ఎన్నికల ఫలితాలతో డీలా పడ్డ తెలంగాణ బీజేపీ శ్రేణుల్ని యాక్టివ్ చేసే పనిలో పడింది ఆ పార్టీ హైకమాండ్. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఇవాళ బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఢిల్లీ పర్యటనలో ఉండగా.. ఇప్పుడు బండి సంజయ్‌ను కూడా పిలవడం హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ బీజేపీని గాడిన పెట్టే పనిలో ఉంది బీజేపీ అగ్ర నాయకత్వం. కర్నాటక ఎన్నికల ప్రభావం తెలంగాణపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరుతో.. కొంతకాలంగా తెలంగాణ బీజేపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నాయకుల మధ్య వర్గపోరుపై బీజేపీ అగ్ర నాయకత్వం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
నాయకుల వ్యక్తిగత లక్ష్యాలతో పార్టీ నష్టపోతోందన్న భావనలో కమలం పార్టీ నాయకులు ఉన్నారు. పరిస్థితులు చేయి దాటకముందే తెలంగాణ బీజేపీని గాడిలో పెట్టాలని పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో సంజయ్, ఈటల రాజేందర్‌ను ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆఖరులో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. కేడర్‌ను సిద్ధం చేయాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com