కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తొలి కేబినెట్ భేటీ

నేడు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నూతన సచివాలయంలో తొలిసారి కేబినెట్ భేటీ జరుగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంకానున్న ఈ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరుగనున్నందన సంక్షేమ పథకాల అమలు, నిధుల విడుదలపై మంత్రివర్గం చర్చించనుంది. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున... పోడు పట్టాల పంపిణీ తేదీలు, గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను ప్రకటించి అమలు కార్యచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలు స్తోంది. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ విషయంపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది.
గవర్నర్ నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీలు రాజేశ్వరరావు, ఫారూఖ్ హుస్సేన్ పదవీకాలం ఈనెల 27తో ముగియనుంది. ఆ రెండు స్థానాలకు ఎమ్మెల్సీల పేర్లను కేబినెట్ ఆమోదించి గవర్నర్ తమిళిసైకి సిఫారసు చేసే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. జూన్ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలని ఇప్పటికే అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ అమర వీరుల స్మారకం ప్రారంభ తేదీని కూడా మంత్రి వర్గ సమావేశంలో ఖరారుచేసే అవకాశం ఉంది.
గవర్నర్ తమిళిసై తిప్పిపంపిన రెండు బిల్లులపై ఏం చేయాలని మంత్రివర్గంలో చర్చ జరగనుంది. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్ మెంట్ సవరణ బిల్లు 2022 ప్రకారం ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్ల వయో పరిమితిని 61 నుంచి 65కు పెంచా లన్న ప్రతిపాదనపై కేబినెట్ మరోసారి కసరత్తు చేయనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com