ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

ఈ ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మజ్లిస్ పార్టీ వ్యవహారం ఎవరికీ అంతుచిక్కడం లేదు. వాస్తవానికి ఎంఐఎం చీఫ్ అసద్ తెలుగురాష్ట్రాల్లో మినహా ఎక్కడ ఎన్నిక జరిగినా వాలుతాడు. చెప్పాలంటే మహారాష్ట్ర, బీహార్‌తో పాటు యూపీ రాష్ట్రాల్లో రెండు ఎంపీ సీట్లు గెలిపించుకున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఆయన ఆసిఫాబాద్, సదాశివ పేటలో మీటింగ్స్ పెట్టి అన్ని పార్టీలకు సవాలు విసిరాడు. ఈ సారి రాష్ట్రంలో 119 సీట్లలో పోటీ చేస్తామని కుండబద్ధలు కొట్టారు. MIM ఇన్ని స్థానాల్లో మాత్రమే పోటీ చేయాలని తమకు ఏ ఇతర పార్టీ సూచించదని, సమయం వచ్చినప్పుడు తమ సత్తా చూపిస్తామంటున్నారు. దీంతో ఎవరి ఓటు బ్యాంకు మీద ప్రభావం పడుతుందోనని బీఆర్ఎస్, కాంగ్రెస్‌తో పాటు బీజేపీ సైతం చర్చలు జరపుతోంది.
ప్రస్తుతం తెలంగాణలో MIM 7సీట్లకే పరిమితమైంది. జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ చోట్ల గట్టి పోటీ ఇచ్చినా గెలవలేకపోతుంది. అయితే నిజామాబాద్‌లో బీఆర్ఎస్‌తో కలిపి కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపాల్టీలోనూ సత్తా చాటింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బైంసా, అసిఫాబాద్ చోట్ల MIM మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసింది. కరీంనగర్ టౌన్‌లో సైతం MIMకు క్యాడర్ బలంగానే ఉంది. వరంగల్ జిల్లాలోనూ ముస్లిం ప్రబావిత నియోజకవర్గాలున్నాయి. వరంగల్ ఈస్ట్‌లోనే దాదాపు 70వేల మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఇప్పటివరకు మైనార్టీలంతా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌కి మద్దతు తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత .. జరిగిన రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ వైపు నిలిచారు.
2018 ఎన్నికల్లో MIM పరోక్ష సహాకారం తీసుకుంది బీఆర్ఎస్. ఇప్పటికీ గులాబీ దళపతి కేసీఆర్... MIM తమ మిత్రపక్షమని పదే పదే చెబుతూవస్తుంటారు. అయితే గత రెండ్రోజులుగా MIM చీఫ్ అసద్ వ్యాఖ్యలు హీట్ పెంచుతున్నాయి. హిందూ ఆలయాలకు ఖర్చు పెడుతున్న కేసీఆర్‌ను మైనార్టీలపై దృష్టి సారించాలంటున్నారు. ఓల్డ్ సీటీలో ఉస్మానియా ఆస్పత్రి మెరుగు పరచడంలేదని.. MGBS నుంచి ఫలక్ నమా వరకు మెట్రో పూర్తిచేయాలని డిమాండ్ చేస్తున్నారు.
బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ సైతం MIM అన్ని స్థానాల్లో పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కారు స్టీరింగ్... MIM చేతిలో లేకుంటే పోటీలో నిలవాలంటున్నారు. ప్రధానంగా MIM పోటి చేస్తే.. 30 నుంచి 40 స్థానాల్లో బీజేపీ వర్సెస్ MIMగా పోలరైజేషన్ వస్తే తమ గెలుపు ఖాయమనే భావనలో బీజేపీ ఉంది. అటు మైనార్టీలు సైతం ఈసారి బీఆర్ఎస్, ఓ వైసీని నమ్మరని తమవైపే నిలవడం ఖాయమంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. మరి మొత్తానికి MIM తెలంగాణలో మళ్లీ ఓల్డ్ సిటికే పరిమితమవుతుందా.. లేక తెలంగాణ వ్యాప్తంగా అభ్యర్థులను నిలుపుతుందా అనేది సస్పెన్స్‌గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com