ఇవాళ గద్దర్‌ అంత్యక్రియలు

ఇవాళ గద్దర్‌ అంత్యక్రియలు

గద్దర్‌.. ఈ పదానికి పరిచయం అక్కర్లేదు. వివరణ అవసరం లేదు. తెలుగు నేలలోనే కాదు, దేశం నలుమూలలా తన గొంతుకతో ప్రజలను ఉత్తేజపరిచిన ప్రజాగాయకుడు గద్దర్‌. తల్లి కడుపులోంచి బయటపడ్డ మరుక్షణం.. చిలకరించిన నీటి తుంపరలతో కెవ్వున వేసిన కేక, ఏడు పదుల వయస్సులో నిలిచిపోయింది. ఎంతో మందిలో చైతన్యం తీసు కొచ్చిన ఆ గొంతు మూగబోయింది.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్.. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గుండెపోటుతో కొద్దిరోజుల కిందట అమీర్‌పేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరిన ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. అయితే.., ఊపిరితిత్తులు, యురినరీ స మస్యలతో ఆరోగ్యం మరింత క్షీణించడంతో కన్నుమూశారు. గద్దర్‌ మరణంతో సికింద్రాబాద్‌ భూదేవి నగర్‌లోని ఆయన నివాసం వద్దకు బంధువులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. దీంతో భూదేవి నగర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఇక గద్దర్ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. అంత్యక్రియల్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించ నుంది. ప్రజల సందర్శనార్థం గద్దర్‌ పార్థివదేహాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచారు. రాజకీయ ప్రముఖులు, ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులు అర్పిస్తున్నారు. ఉదయం 10గంటల వరకు ఎల్బీ స్టేడియంలో గద్దర్ పార్థివదేహం ఉండనుంది.

ఉదయం 10గంటల 30నిమిషాలకు గద్దర్ భౌతికకాయాన్ని గన్‌పార్క్‌కు తరలిస్తారు. అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించిన అనంతరం అల్వాల్‌లోని గద్దర్‌ నివాసానికి ఆయన భౌతికకాయాన్ని తరలించనున్నారు. ఆ తర్వాత గద్దర్‌ స్థాపించిన మహాబోధి విద్యాలయం ఆవరణలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గద్దర్ కోరిక మేరకే విద్యాలయ గ్రౌండ్‌లో అంత్యక్రియలు చేసేందుకు నిర్ణయించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


Next Story