బండి, రేవంత్‌ క్షమాపన చెప్పాలి లేదంటే 100 కోట్లు పరువు నష్టం కట్టివ్వాలి: కేటీఆర్‌

బండి, రేవంత్‌ క్షమాపన చెప్పాలి లేదంటే 100 కోట్లు పరువు నష్టం కట్టివ్వాలి: కేటీఆర్‌
TSPSC పేపర్ లీక్‌ వ్యవహారంతో తెలంగాణలో పొలిటికల్ హీట్‌

TSPSC పేపర్ లీక్‌ వ్యవహారంతో తెలంగాణలో పొలిటికల్ హీట్‌ పెరిగింది. ప్రభుత్వంపై విపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా కేటీఆర్ టార్గెట్‌గా బీజేపీ, కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. కేటీఆర్‌ను విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు కూడా అంతే స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇస్తున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో కేటీఆర్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఓవైపు ఆరోపణలకు ఆధారాలు చూపెట్టాలని సిట్‌ అంటుంటే.. మరోవైపు విపక్ష నేతలపై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగినట్లు అయ్యింది.

పేపర్ లీకేజీకి బాధ్యతగా కేటీఆర్ రాజీనామా చేయాలని బండి సంజయ్, రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. వరుస పెట్టి ఆరోపణలు చేస్తూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలతో విపక్ష పార్టీలో హోరెత్తిస్తున్నాయి. మరోవైపు కేసు విచారణలో వేగంగా పెంచకుండా తమకు నోటీసులు ఇవ్వడమేంటని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. తమ వద్ద పూర్తి సమాచారం ఉందని.. అయితే సిట్‌పై తమకు నమ్మకం లేదంటున్నారు. ఇక సిట్టింగ్‌ జడ్జితో గానీ, సీబీఐతో గానీ విచారణ జరిపిస్తే ఆధారాలు ఇస్తామంటున్నారు విపక్ష నేతలు.

మరోవైపు విపక్షాలు తమపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలంటూ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ శ్రేణులు కొట్టి పారేశారు. అయినా కేటీఆర్‌ను పదే పదే విపక్ష పార్టీల అధ్యక్షులు టార్గెట్ చేయడంతో సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే సిట్‌ అధికారులు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఆరోపణలు చేస్తున్న వారంతా ఆధారాలు ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. ఇక బీఆర్ఎస్ నేతలు సైతం నోటికి పని చెబుతున్నారు. ఆధారాలు ఇవ్వకుండా కేవలం ఆరోపణలకే పరిమితం అవుతున్నారని భగ్గుమంటున్నారు.

ఇక ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణపై మంత్రి కేటీఆర్ తాడోపేడో తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు. TSPSC వ్యవహారంలో తనపై ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును అనవసరంగా లాగుతున్నారని తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు ఇచ్చారు. సుదీర్ఘ కాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇక ఇండియన్ పీనల్ కోడ్ లోని 499, 500 నిబంధనల ప్రకారం పరువు నష్టం దావా నోటీసులు పంపించారు. తనపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులో డిమాండ్ చేశారు. వారం లోగా క్షమాపణలు చెప్పకుంటే 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.

Tags

Next Story