Telangana : ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ పరిశ్రమ అభివృద్ధి

Telangana : ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ పరిశ్రమ అభివృద్ధి
X

హైదరాబాద్ ఆవల అపార ఐటీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కే.తారకరామారావు వాషింగ్టన్ డీసీలో 30 కి పైగా ఐటీ కంపెనీ యాజమాన్యాలతో సమావేశయ్యారు. డి కాంజెస్ట్ (Decongest), డీ కార్బోనైజ్ (Decarbonize) డీ సెంట్రలైజ్ ( Decentralize) అనే త్రీడీ మంత్రంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్న కేటీఆర్, హైదరాబాద్ నగరం ఆవల ద్వితీయ శ్రేణి నగరాలలోనూ విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.

తెలంగాణలోని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించడంతో పాటు ఇక్కడ ఉన్న అనుకూలతలు, తాము కల్పించిన మౌలిక వసతులపై మాట్లాడారు. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్లో ఐటీ టవర్లను ప్రారంభించుకున్నామన్న కేటీఆర్, త్వరలోనే సిద్దిపేట, నిజామాబాద్ ,నల్గొండలోనూ ఐటీ టవర్ల నిర్మాణం పూర్తి కాబోతుందని చెప్పారు. దీంతోపాటు అదిలాబాద్ లోనూ మరొక ఐటీ టవర్ నిర్మిస్తున్నామన్నారు. తాను ఈ మధ్యనే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఏర్పాటుచేసిన రెండు ఐటీ కంపెనీలను పరిశీలించానని చెప్పిన కేటీఆర్, బెల్లంపల్లి లాంటి చిన్న పట్టణంలోనే ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతున్నప్పుడు తెలంగాణలోని ఏ పట్టణంలోనైనా ఐటీ కార్యాలయాలను ఏర్పాటుచేసి నడపడం ఈజీ అన్నారు. కరోనా సంక్షోభం తర్వాత ఐటీ కార్యకలాపాలను నిర్వహించడంలో కంపెనీలు వినూత్న పంథాను అనుసరిస్తున్నాయని ప్రస్తుతం పెరిగిన ఇంటర్నెట్ కనెక్టివిటీతో ద్వితీయ శ్రేణి నగరాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయడం సులభం అయిందన్నారు.

Tags

Next Story