Telangana BJP : ఓరుగల్లు వేదికగా నిరుద్యోగ మార్చ్‌

Telangana BJP : ఓరుగల్లు వేదికగా నిరుద్యోగ మార్చ్‌

TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంపై బీజేపీ పోరును ఉధృతం చేసింది. ఓరుగల్లు వేదికగా నిరుద్యోగ మార్చ్‌కు శంఖారావం పూరిస్తోంది. హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్శిటీలో జరిగే నిరుద్యోగ మార్చ్‌కు సర్వంసిద్ధం చేసింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించే ఈ నిరుద్యోగ ర్యాలీ విజయవంతం అయ్యేలా భారీ ఏర్పాట్లు చేస్తోంది కమలదళం. సాయంత్రం 4 గంటలకు బీజేపీ ఈ నిరుద్యోగ మార్చ్‌ను ప్రారంభించనుంది. కాకతీయ యూనివర్శిటీ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగనుంది. TSPSC పేపర్ లీకేజీ, నిరుద్యోగుల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. బండి సంజయ్ మార్చ్‌ను ప్రారంభించి ప్రసంగించనున్నారు. ఎంపీ లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో పాటు భారీగా బీజేపీ నేతలు, కార్యకర్తలు తరలిరానున్నారు. ఇప్పటికే బీజేపీ స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలతో ఓరుగల్లు జిల్లా కాషాయమయంగా మారింది.

అటు బీజేపీ తలపెట్టిన నిరుద్యోగ మార్చ్‌కు హన్మకొండ జిల్లా పోలీసులు పలు షరతులు విధించారు. ర్యాలీ రోడ్డుకు ఎడమ వైపునే సాగాలని, డీజే స్పీకర్లు వాడొద్దని స్పష్టంచేశారు. నిరుద్యోగ మార్చ్ ప్రశాంతంగా, సామరస్యంగా సాగాలని.. మధ్యలో ఎలాంటి సమావేశాలు నిర్వహించొద్దని సూచించారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థ కార్యకలాపాలకు ఆటంకం కలిగించొద్దని తెలిపారు. ప్రభుత్వాన్ని గానీ, ఏ ఇతర రాజకీయ పార్టీలపైనా గానీ, సంస్థను లేదా ఏ వర్గాన్ని అయినా విమర్శిస్తూ ప్రసంగాలు చేయొద్దని షరతులు విధించారు. ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే నిరుద్యోగ మార్చ్‌ను రద్దు చేస్తామని హన్మకొండ జిల్లా పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story