ఏడాదిలో రూ.6లక్షల ఇడ్లీలు ఆర్డర్.. హైదరాబాది రికార్డ్

హైదరాబాద్.. ఈ నగరం బిర్యానీ సామ్రాజ్యం. రోజూ లక్షల ఆర్డర్లు.. హోటళ్ల నుంచి టన్నుల కొద్దీ హాట్ హాట్ బిర్యానీ నిరంతరం ఇళ్లలోకి చేరవేస్తూనే ఉంటారు. ఐతే.. ఒకే ఒక్కడు బిర్యానీ నై.. ఇడ్లీకే జై అంటున్నాడు. అనడమేనా.. ఈ అల్పాహారాన్ని అధికంగా లాగించేశాడట. వరల్డ్ ఇడ్లీ డే అంటూ స్విగ్గీ వెల్లడించిన ఈ నిజం.. సదరు ఇడ్లీ ప్రియుడికి వీరతాళ్లు వెయ్యాల్సిందే అంటోంది.
ఇడ్లీలంటే పడిచచ్చే సదరు వ్యక్తి వేల ప్లేట్ల ఇడ్లీలు పొట్టలోకి దింపేశాడట. ఇడ్లీలు విత్ చెట్నీ, సాంబార్ అంటే ఎగిరి గంతేసేలా ఉన్నాడు.. ఏడాదిలో అక్షరాలా 6 లక్షల రూపాయల విలువైన ఇడ్లీలను ఆర్డర్ చేశాడట. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి గత ఏడాది మార్చి 30 నుంచి ఈ ఏడాది మార్చి 25వ తేదీ మధ్య... 8 వేల 428 ప్లేట్ల ఇడ్లీలను ఆర్డర్ చేసి తెప్పించుకున్నాడట.. మార్చి 30ని ప్రపంచ ఇడ్లీ దినోత్సవంగా ఈ విషయాన్ని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది.
తన కోసమే కాదు.. తన కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం సదరు వ్యక్తి.. హైదరాబాద్ నుంచే కాకుండా బెంగళూరు, చెన్నైలో ఉన్నప్పుడు కూడా ఇడ్లీలను తెప్పించుకున్నాడట. గత 12నెలల్లో తాము దేశవ్యాప్తంగా 3.3 కోట్ల ప్లేట్ల ఇడ్లీలను డెలివరీ చేశామని.. ఇందులో 8 వేల 428 ప్లేట్ల ఇడ్లీలను ఒక్క హైదరాబాదీయే ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com