శ్రీరామ నవమి వేడుకలకు ముస్తాబైన భాగ్యనగరం

శ్రీరామ నవమి వేడుకలకు హైదరాబాద్ మహానగరం ముస్తాబైంది. ఇవాళ నగరంలో జరగనున్నశ్రీరాముడి శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీతారాంబాగ్‌లోని రామాలయం నుంచి కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర జరుగనుంది. ఈ యాత్రలో పలువురు ప్రజా ప్రతినిధులు, రామయ్య భక్తులు పాల్గొననున్నారు. ఈ శోభాయాత్ర మంగళ్‌హాట్‌లోని సీతారాంబాగ్ ఆలయం నుంచి ప్రారంభమై.. హనుమాన్ వ్యాయామశాల వరకు సాగనున్నట్లు ఉత్సవ సమితి ప్రతినిధులు తెలిపారు.
ఈ శోభాయాత్ర సీతారాంబాగ్ నుంచి బోయగూడ కమాన్, బేగంబజార్,సిద్ధంబర్‌బజార్,పుత్లిబౌలి, బడిచౌడి మీదుగా హనుమాన్ వ్యాయామశాలకు చేరుతుంది. అంబర్పేట్ నుంచి, ఫిలింనగర్ నుంచి మరి కొన్ని శోభాయాత్రలు హనుమాన్ వ్యాయామశాలకు రానున్నాయి.ఆకాశ్ పురి నుంచి మరో శోభాయాత్ర దూల్పేట్దగ్గర కలుస్తుందని, శాంతియుతంగా శోభాయాత్ర నిర్వహిస్తామని భాగ్యనగర్ఉత్సవ సమితి తెలిపింది.
ఇక శోభాయాత్రకు వచ్చే భక్తులకు దారి పొడవున అన్నీ సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు భగవత్‌రావు తెలిపారు.శ్రీరామనవమి శోభాయాత్రకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు తరలిరావాలని ఆహ్వానిస్తున్నామన్నారు. యాత్రలో భాగంగా శ్రీరాముని వేషధారణతో పాటు స్వతంత్ర సమరయోధుల వేషధారణలో పలువురు కనిపించనున్నారు. ఈ శోభాయాత్రకు ముఖ్య అతిథులుగా కాశీ నుంచి సుమేరు పీఠాధిపతి శంకరాచార్య స్వామి, నరేంద్ర నంద సరస్వతి, రాజస్థాన్ నుంచి క్రాంతికారి శ్రీసంత్ భోమా రాంజీ హాజరు కానున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com