రాహుల్ పై అనర్హత వేటు వేయడం దుర్మార్గం : భట్టి విక్రమార్క

రాహుల్ పై అనర్హత వేటు వేయడం దుర్మార్గం : భట్టి విక్రమార్క

కేంద్ర ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టివిక్రమార్క నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం దుర్మార్గమన్న భట్టి.. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుందన్నారు. ఆసిఫాబాద్‌ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆయన.. రాహుల్‌పై బీజేపీ తీరు నిరసనగా కాగడాల ర్యాలీ తీశారు. అక్రమ కేసులు పెట్టి జైలుశిక్షపడేలా చేశారని ఆరోపించారు. ఇది మోదీ అమిత్‌ షా నాయకత్వంలో కక్ష సాధింపు చర్య అన్నారు. బీజేపీ తొమ్మిదేళ్ల పాలనలో దేశ సంపదను అదానీ వంటి కార్పొరేట్ దిగ్గజాలకు దోచిపెట్టారని మండిపడ్డారు. ప్రజల సంపద ప్రజలకే చెందాల్సిన ఈ దేశంలో ప్రధాని మోదీ ఆదానికి దోచిపెడుతుంటే గొంతెత్తి ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీని... పార్లమెంటుకు రాకుండా అడ్డుకోవడానికే కుట్రలు చేస్తున్నారని అన్నారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశ సంపద దోపిడీకి గురవుతుందన్న ఆయన.. పార్లమెంటు లోపల, బయట రాహుల్ గత తొమ్మిది సంవత్సరాలుగా బీజేపీ పాలనను ప్రశ్నిస్తున్నారని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.


10వ రోజు ఆసీఫాబాద్ జిల్లాలో భట్టి విక్రమార్క పాదయాత్ర సాగింది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్రలో ముందుకు సాగారు. ఈ సందర్భంగా భట్టికి అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. మంగళహారతులతో స్వాగతం పలికిన మహిళలు.. తమ సమస్యలను భట్టికి చెప్పుకున్నారు. అన్ని వర్గాల సమస్యలు విన్న భట్టి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చి ముందుకు సాగారు. ఇక కాంగ్రెస్ పార్టీలో గెలిచి బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యే సక్కుకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story