నిప్పులు కురిపిస్తున్న భానుడు
తెలంగాణలో సూర్యుడు సుర్రమంటున్నాడు. భానుడి ప్రతాపానికి ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. నిప్పులు కక్కుతున్న ఎండలతో పలు జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. మధ్యాహ్నం వేళ మరింత భగభగమండిపోతున్నాడు. దాంతో ఇటు వేడి.. అటు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. తెలంగాణలో 11 జిల్లాల్లో 44 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లలో 44.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. హన్మకొండ జిల్లా ధర్మాసాగర్‌లో 44.7, జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లో 44.6, అదే జిల్లా రాఘవాపూర్‌లో 44.5 డిగ్రీలు నమోదయ్యాయి. ఈ నెల 21 తర్వాత రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కాస్త తగ్గనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
భానుడి చండ ప్రచండగా మారుతుంటే.. వడగాల్పుల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. వడదెబ్బతో తెలంగాణలో ఇప్పటివరకు నలుగురు మృతి చెందారు. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం దేవతలబావిగూడెం గ్రామంలో హమాలీ రమావత్ జాను, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం పులిమడుగులో పరమేశ్వరి మరణించారు. అలాగే కామారెడ్డి జిల్లా బీర్కూర్‌కు చెందిన కల్లు సాయిలు, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురంలో గులాబ్‌సింగ్ అనే టార్పాలిన్ల వ్యాపారి వడదెబ్బతో మృతి చెందారు. రానున్న మూడ్రోజుల పాటు మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ తెలిపింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com