ఖమ్మంలో బీజేపీ లంచ్ పాలిటిక్స్ ఫలించేనా..!

ఖమ్మంలో బీజేపీ లంచ్ పాలిటిక్స్ ఫలించేనా..!
తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిందా? ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బీజేపీ గాలం వేస్తోందా? పొంగులేటితో బీజేపీ నేతల మంత్రాంగం ఫలిస్తుందా? పొంగులేటి నిర్ణయంతో బీఆర్ఎస్‌ నష్టపోతుందా? రాష్ట్ర రాజకీయాలపై ఖమ్మం ప్రభావం చూపనుందా?


ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరింది. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ అసంతృప్తులను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా ఖమ్మం మాజీ ఎంపీ బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బీజేపీ గాలం వేస్తోందని జిల్లాలో చర్చ జరుగుతోంది. అటే కాంగ్రెస్ పార్టీ కూడా పొంగులేటితో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పొంగులేటి ఏ పార్టీలో చేరతారోనని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆయన అనుచరులతో పాటు రాజకీయంగానూ ఉత్కంఠను రేపుతోంది. పొంగులేటితో బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఖమ్మంలోని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి చేరుకొని విస్తృతంగా చర్చలు జరిపారు. బీజేపీ చేరికల కమిటీ రాకముందే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పొంగులేటితో భేటీ అయ్యారు.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావుతో బీజేపీ చేరికల కమిటీ సుదీర్ఘంగా చర్చించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేసీఆర్ ను గద్దె దించే లక్ష్యం కలిగిన బలమైన శక్తులతో తమ ప్రయాణం కొనసాగించాలని పొంగిలేటి భావిస్తున్నారట.. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడిందని రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నుంచి మరింత మంది నాయకులు బీజేపీలో చేరతారని ఈటెల రాజేందర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లా మీద కన్నేసిన కమలదళం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటినుంచి పావులు కదుపుతోంది..ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ అనుకున్న స్థాయిలో ప్రజల్లోకి దూసుకు వెళ్లలేకపోతోంది.. బీజేపీ పార్టీని ప్రజలకు చేరువ చేయగల నాయకుడు లేక ఎన్నికల ముంగిట్లో చతికిలబడుతోంది. ఈ క్రమంలోనే ప్రజల్లో చరిష్మా, ఆదరణ ఉన్న నేతల కోసం అన్వేషణ మొదలుపెట్టింది.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేరితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ బలపడుతుందని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోందట. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అనుచర గణం ఉంది.. పొంగులేటి ప్రజల్లో చరిష్మా ఉన్న లీడర్.. ఆర్థికంగా బలమైన నేత కావడంతో కమలదళం పొంగులేటి మీద గురి పెట్టినట్లు తెలుస్తోంది.

ఈటల, పొంగులేటి మిత్రులు కావడంతో పొంగులేటి చేరిక బాధ్యతలను బీజేపీ అధిష్టానం ఈటలకు అప్పగించిందన్న టాక్ వినిపిస్తోంది..ఈటల రాజేందర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల సీట్ల సర్దుబాటు చర్చించారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. పార్టీలో చేరితే సముచిత స్థానం లభిస్తుందని, పార్టీ అగ్ర నేతల వద్దకు రావాలని పొంగులేటిని ఈటల రాజేందర్ ఆహ్వానంచారట. అయితే బీజేపీలో చేరికపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంకా నిర్ణయం తీసుకోలేదని వినికిడి. పొంగులేటి బీఆర్ఎస్ పై తిరుగుబాటు జెండా ఎగరవేసినప్పటినుంచి ఏ పార్టీలో చేరతారని అంశంపై అంతర్గత చర్చలు కొనసాగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పొంగులేటితో చర్చించినట్టు టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరితే వచ్చే ఎన్నికల్లో గెలుపు సునాయాసం అవుతుందని పొంగులేటికి కాంగ్రెస్ నాయకులు వివరించినట్లు సమాచారం. అయితే పొంగులేటి అనుచరులు అంతర్గత సర్వేల ఆధారంగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని పొంగులేటిని కోరినట్లు సమాచారం.

పొంగులేటి చేరికకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా?పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇద్దరు నేతలు ఏ పార్టీలో చేరేది తెలంగాణ రాష్ట్ర అవతరణ జూన్ 2న ప్రకటిస్తారన్న టాక్ వినిపిస్తోంది? ఖమ్మం, మహబూబ్ నగర్ రెండిట్లో ఏదో ఒకచోట తెలంగాణ ఆత్మగౌరవ పొలికేక పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీలో జాయిన్ అవుతారని పొంగులేటి అనుచరుల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాతే పొంగులేటి తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని టాక్ వినిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story