బండి vs కేటీఆర్‌ల ట్వీట్ వార్ కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్

మంత్రి కేటీఆర్, టీ.బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు మధ్య కొనసాగుతున్న ట్వీట్ వార్‌కు తెలంగాణ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. దొంగలు దొంగలు తన్నుకుంటే చోరీ కథ బయటపడిందని ట్వీట్ చేసింది. విభజన చట్టాన్ని తుంగలోకి తొక్కి తెలంగాణను పట్టించుకోని పార్టీ ఒకటి.. ఇచ్చిన హామీలను కూడా సాధించలేని చవట పార్టీ మరొకటి.. "ఇద్దరూ తోడు దొంగలే.. ఇద్దరూ తెలంగాణ ద్రోహులే" అని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. కేటీఆర్, బండి సంజయ్ చేసిన ట్వీట్లను జత చేస్తూ విమర్శలు చేసింది.
అంతకుముందు ప్రధాని మోదీ పేరుతో మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వం, మెట్రో రెండో దశ ఇవ్వం, ఐటీఐఆర్ ప్రాజెక్టు ఇవ్వం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వం, గిరిజన యూనివర్సిటీ ఇవ్వం అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. మోదీ ప్రాధాన్యతల్లో అసలు తెలంగాణ రాష్ట్రమే లేనప్పుడు.. మరి రాష్ట్ర ప్రజల ప్రాధాన్యతా క్రమంలో ప్రధాని ఎందుకు ఉండాలని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. ఆ దిక్కుమాలిన పార్టీ తెలంగాణలో ఎందుకుండాలి అంటూ నిలదీశారు.
అటు మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కూడా అదే స్టైల్‌లో మరో ట్వీట్ చేశారు. ఉద్యమకారులకు పార్టీలో చోటివ్వం, దళితులకు మూ డెకరాలు ఇవ్వం, ఖాళీలున్నా ఉద్యోగాలను భర్తీ చెయ్యం, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వం, ప్రకటనలే తప్ప ఆలయాలకు సైతం నిధులు ఇవ్వం అంటూ కేసీఆర్ పేరుతో ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి ప్రధాన బాధ్యతల్లో చోటీవ్వన్నప్పుడు ఎందుకు భరించాలి? సహించాలి? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. అసలు కేసీఆర్ తన పార్టీ నుంచే తెలంగాణను తొలగిస్తే.. ఆయనను ఎందుకు ఈ రాష్ట్రం నుంచి తొలగించకూడదు? అంటూ ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com