వందో రోజుకు చేరుకున్న భట్టి పాదయాత్ర

వందో రోజుకు చేరుకున్న భట్టి పాదయాత్ర
32 నియోజకవర్గాలు పూర్తి చేసుకుని తాజాగా సూర్యాపేట నియోజకవర్గంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్ పాదయాత్ర నేటితో వందో రోజుకు చేరుకుంది. ఇవాళ నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగనుంది. ఉదయం 7గంటల 30 నిమిషాలకు కేతేపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. కేతేపల్లి, చీకటి గూడెం, ఉప్పల్ పహాడ్, భాగ్యనగరం, కొప్పోలు గ్రామాల్లో నేడు పాదయాత్ర సాగనుంది. ఇక ఉప్పల్ పహాడ్ గ్రామంలో లంచ్ బ్రేక్ తీసుకుంటారు భట్టి. ఇక రాత్రికి కొప్పోలు చేరుకుని అక్కడే బస చేస్తారు.

మార్చ్‌ 16న ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి గ్రామం నుంచి మొదలైన పాదయాత్ర... నిర్విరామంగా కొనసాగుతూ నేటితో వంద రోజులకు చేరింది. ఇప్పటి వరకు భట్టి విక్రమార్క 11వందల 50 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. 100 రోజుల పాదయాత్రలో 15 జిల్లాల్లో పర్యటించారు. 32 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసిన భట్టి.. 750కి పైగా గ్రామాల్లో పర్యటించారు. ఇక దేవరకొండ నియోజకవర్గం గుమ్మడవెల్లిలో వెయ్యి కిలోమీటర్ల పైలాన్ ఆవిష్కరించారు. కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా భట్టి పాదయాత్ర సాగుతుంది. భానుడి భగభగలు, వరుణుడి ప్రతాపాన్ని సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నారు భట్టి విక్రమార్క. కఠిన వాతావరణంలోనూ రెస్ట్‌ లేకుండా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ.. ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు.

వేలమంది ప్రజలతో ముఖముఖిగా మాట్లాడి, వారి కష్టాలను, తెలుసుకున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తుందనే విషయాన్ని క్లారిటీగా వివరిస్తున్నారు భట్టి. ఇందిరమ్మ రాజ్యం రావాలి.. ఇంటింటా సౌభాగ్యం నెలకొనాలని భట్టి నినదిస్తున్నారు. ఆనాడు వైఎస్సార్ ఎంచుకున్న మార్గంలోనే భట్టి సాగడం విశేషం. నాడు పాదయాత్రలో వైఎస్‌ఆర్ రైతుల సమస్యలు తెలుసుకుని.. అధికారంలోకి రాగానే పరిష్కరించారు. నేడు భట్టి సైతం పోడు భూములు, ధరణి సమస్యలు ఎదుర్కుంటున్న రైతులతో నేరుగా మాట్లాడి.. వారికి భరోసా కల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్‌ వైపు చూసేలా భట్టి అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇక పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తెలంగాణలో సరికొత్త ప్రజా విప్లవోద్యమంలా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ పీఠాలను కదిలిస్తోంది. దీంతో భట్టి విక్రమార్క పాదయాత్ర చేసిన ప్రాంతాల్లో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు విస్తృతంగా పర్యటిస్తున్నారు.

ఇప్పటి వరకు 15 జిల్లాల్లో పాదయాత్ర చేశారు భట్టి విక్రమార్క. ఇక 32 నియోజకవర్గాలు పూర్తి చేసుకుని తాజాగా సూర్యాపేట నియోజకవర్గంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారు. కార్యకర్తలతోనే సాదారణ వ్యక్తిలా పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. విరామ సమయంలో టెంటుల్లో అందరితో కలిసి గడుపుతున్నారు. అన్ని వర్గాలను ఏకం చేస్తూ సరికొత్త ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిస్తున్నారు. కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా భట్టి అడుగులు వేస్తున్నారు. పాదయాత్ర ప్రారంభం నుంచి ఇంటి ముఖం చూడలేదు. అన్ని పండగలకు కార్యకర్తలతో కలిసే జరుపుకుంటున్నారు. మార్చి 22న ఉగాది పండుగను కెరిమెరి మండలం ఝరి గ్రామం వద్ద ఆదివాసులు, గిరిజనులతో కలిసి కుటుంబ సమేతంగా జరుపుకున్నారు. వారితోనే కలిసి భోజనాలు చేశారు. మార్చి 30న బెల్లంపల్లిలో శ్రీరామనవమి వేడుకలు, ఏప్రిల్ 21న జమ్మికుంట మండలం శాంతినగర్‌లో రంజాన్ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక మసీదులో ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా ఇఫ్తార్ విందు ఇచ్చారు.

పాదయాత్రలో కొన్ని ముఖ్య ఘట్టాలు ఉన్నాయి. మార్చి 22న ఝరి గ్రామంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 125 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఏప్రిల్ 14న మంచిర్యాలలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేలా సత్యాగ్రహ సభ నిర్వహించారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ముఖ్యఅతిథిగా హాజరుకాగా.. దాదాపు లక్షమంది ప్రజలు ఈ సభలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఏప్రిల్ 16న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద 300 కిలోమీటర్ల మైల్ స్టోన్‌ను తాకింది పీపుల్స్ మార్చ్ యాత్ర. మార్చి 29 జనగామ జిల్లా నర్మెట్టలో 500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. మే 5న భువనగిరి నియోజకవర్గం మగ్గంపల్లి గ్రామంలో 600 కిలోమీటర్లు, చేవెళ్ల నియోజకవర్గం రామానుజాపూర్‌లో 700 కిలోమీటర్లు, జడ్చెర్ల నియోజకవర్గం కేశవరాంపల్లిలో 800 కిలోమీటర్లు పూర్తి అయ్యాయి.

మండె ఎండల్లోనూ భట్టి పాదయాత్ర కొనసాగడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. మే 18న మహబూబ్ నగర్ జిల్లా రుక్కంపల్లి గ్రామంలో పాదయాత్రలో ఉన్న భట్టికి వడదెబ్బ తగిలింది. ఇక వైద్యుల సూచనతో 5 రోజులు విశ్రాంతి తీసుకున్న భట్టి... మళ్లీ పీపుల్స్ మార్చ్ పాదయాత్రను మొదలు పెట్టారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభించిన నాటినుంచీ ఇప్పటివరకూ.. ఒక్కసారి కూడా వాహనాన్ని ఉపయోగించుకోలేదు. అసలైన పాదయాత్ర అంటే ఏంటో చూపిస్తున్నారు భట్టి విక్రమార్క. భట్టి సంకల్పం చేసిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మొత్తంగా భట్టి విక్రమార్క పాదయాత్ర కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్ నింపింది.

Tags

Next Story