Telangana Formation Day : ఈ చరిత్రకు 11 ఏండ్లు..!

Telangana Formation Day : ఈ చరిత్రకు 11 ఏండ్లు..!
X

ఫిబ్రవరి 18, 20 తేదీలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. సరిగ్గా 11 ఏళ్ల క్రితం, ఇదే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదింపజేసింది. తద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది.

ఈ విషయంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు, వివిధ రంగాల కళాకారులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి రావడంతో రాష్ట్రం ఏర్పాటైంది. 2004లో ప్రత్యేక తెలంగాణకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 2004 ఎన్నికల వేళ కరీంనగర్‌లో పర్యటించిన సోనియా గాంధీ యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు ప్రజా ఉద్యమాలను, ప్రజల బలమైన ఆకాంక్షను, వారి పోరాటాన్ని, వారి త్యాగాలను గుర్తించి కాంగ్రెస్.. సోనియా గాంధీ పుట్టిన రోజున డిసెంబర్ 9, 2009లో తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఆ తర్వాత ఆంధ్ర ప్రాంతంలో ఉద్యమాలు చెలరేగడంతో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని నియమించి రాష్ట్ర ఏర్పాటుపై అధ్యయనం జరిపించింది. సంప్రదింపుల అనంతరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు జూలై 30, 2013న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.

ఆ తర్వాత ఏపీ పునర్విభజన బిల్లును 2014 జనవరి 7న కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తద్వారా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇక పార్లమెంటు ఆమోదమే మిగిలిన నేపథ్యంలో 2014 ఫిబ్రవరి 13న ఏపీ పునర్విభజన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం పార్లమెంటులో చెలరేగిన అలజడి ఐదు రోజులపాటు ఉత్కంఠను రేపింది.

ఆంధ్ర ప్రాంత ఎంపీల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ, 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభ ఆమోదం పొందింది. అనంతరం రెండు రోజులకే, అంటే ఫిబ్రవరి 20న రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటన వెలువడింది. బిల్లును లోక్ సభ ఆమోదించిన సమయంలో లోక్ సభకు కేసీఆర్ గైర్హాజరయ్యారు. మార్చి 1, 2014న రాష్ట్రపతి పునర్విభజన బిల్లును ఆమోదించడంతో ప్రభుత్వం గెజిట్ ప్రచురించింది. జూన్ 2, 2014ను నియమిత దినంగా ప్రకటించారు. చిరకాల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

గత 11 ఏళ్ల రాజకీయం.. పాలన

తెలంగాణ ఉద్యమం.. బిల్లు ఆమోదం.. రాష్ట్ర ఏర్పాటు.. ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ అధికారంలోకి రావడం జరిగిపోయాయి. అయితే, గత పదేళ్లలో తెలంగాణ ప్రజల అస్తిత్వ పోరాటానికి ఎంతవరకు ఫలితం దక్కింది? ప్రజల స్వయం పాలన ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయి? అని సగటు తెలంగాణవాది లెక్కలు వేసుకుంటున్నారు. ఈ దశలోనే 2023లో ప్రజలు కాంగ్రెస్‌కు పగ్గాలు అప్పగించారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుకు అడుగులు వేస్తోంది. 55 వేల ఉద్యోగాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తోంది. రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసి, రైతు భరోసా నిధులను దశలవారీగా విడుదల చేస్తోంది. రాజకీయంగా, సామాజికంగా అన్ని వర్గాల ప్రజలకు ప్రజాపాలనలో సముచిత స్థానం కల్పించాలని ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లకై కృషి చేస్తోంది. రాష్ట్రంలో చట్టం చేసి కేంద్రానికి పంపాలని యోచిస్తోంది. ఈ క్రమంలో ముందు కేంద్రం బీసీ రిజర్వేషన్లను అంగీకరిస్తుందా? తదుపరి పార్టీల వ్యూహాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tags

Next Story