TG: "మహా" అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలోకి ప్రజలకు అనుమతి

అంబేడ్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. హుస్సేన్‌సాగర్ తీరంలో 125 అడుగుల ఎత్తుతో నిర్మించిన అంబేడ్కర్ విగ్రహం వద్ద వీవీఐపీల నుంచి సాధారణ ప్రజల వరకు అందరూ నివాళులర్పించేలా చర్యలు చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహం పాదాల దాకా వెళ్లేందుకు ఇప్పటివరకు అవకాశం ఇవ్వలేదు. అయితే అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నేడు వీవీఐపీలను, వీఐపీలను ఇందుకు అనుమతించనున్నారు. అంబేడ్కర్ విగ్రహ పీఠంలో ఏర్పాటు చేసిన లైబ్రరీ, మ్యూజియం సందర్శనకు కూడా ప్రజలను అనుమతించనున్నారు.
ప్రత్యేక అలంకరణ
అంబేడ్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రత్యేక అలంకరణ చేపట్టారు. విద్యుద్దీపాల కాంతులతో విశ్వమానవుడి విగ్రహం మెరిసిపోతోంది.
జయంతి సందర్భంగా పోటీలు
అంబేడ్కర్ జీవితం నుంచి ప్రేరణ పొందే ఘట్టాలను చిత్రిస్తూ రూపొందించిన కళాఖండాలను సేకరించడానికి హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో విద్యార్థులు, కళాకారులకు పోటీలు నిర్వహిస్తున్నారు. రెండు రోజులుగా అంబేడ్కర్ విగ్రహం వద్ద జరుగుతున్న ఈ పోటీల్లో 20బృందాల దాకా పాల్గొంటున్నాయి. పెయింటింగ్, ఇతరత్రా ఆర్ట్ సామగ్రి కోసం హెచ్‌ఎండీఏ ఒక్కో బృందానికి రూ.10వేల చొప్పున అందజేసింది.
125 అడుగుల విశ్వమానవుడు
అంబేడ్కర్ విగ్రహ పీఠంలో గ్రంథాలయం, మ్యూజియం, జ్ఞాన మందిరం, అంబేడ్కర్ జీవిత ముఖ్య ఘట్టాలతో ఫోటో గ్యాలరీ.. వీటితో పాటు 2.93 ఎకరాల్లో ఏర్పాటు చేసిన థీమ్ పార్కు సందర్శనకు త్వరలో ప్రజలను అనుమతించనున్నారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని 2023 ఏప్రిల్ 14న ప్రారంభించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com