వైఎస్ షర్మిలకు 14రోజుల రిమాండ్

పోలీసులపై దాడి కేసులో అరెస్ట్ అయిన వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలను చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు. అయితే జైలుకు తరలించే క్రమంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. షర్మిల వెళ్తున్న పోలీసుల కాన్వాయ్‌ను వైఎస్‌ఆర్‌టీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. షర్మిల అరెస్ట్‌ను ఖండిస్తూ నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం షర్మిలను చంచల్ గూడా జైలుకు తరలించారు.
ఈ కేసులో షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మే 8 వరకు ఆమె రిమాండ్‌లో ఉండనున్నారు. సిట్ కార్యాలయాన్ని ముట్టడించిన తర్వాత టీ సేవ్ నిరాహార దీక్షలో భాగంగా.. ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి మద్దతు కోరాలని షర్మిల నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఇంటి నుంచి షర్మిల బయలుదేరుతుండగా.. పోలీసులు భారీ ఎత్తున మోహరించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, షర్మిలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్న షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో సహా మరో ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ1గా వైఎస్ షర్మిల, ఏ2గా కారు డ్రైవర్ బాలు, ఏ3 గా మరో డ్రైవర్ జాకబ్‌ల పేర్లు చేర్చారు. ఇక ఈ కేసులో షర్మిల బెయిల్ పిటిషన్‌పై ఇవాళ న్యాయస్థానం విచారించనుంది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఇప్పటికే పోలీసులను ఆదేశించింది.
వైఎస్ షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు 24 గంటలూ పని చేస్తారని పోలీసుల తరుపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అలాంటి వారిపై చేయి చేసుకోవడం వల్ల సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందని అన్నారు. షర్మిల తన కారు డ్రైవర్‌ను వేగంగా పోనివ్వాలని చెప్పారని, ఈ క్రమంలో ఓ పోలీస్ కానిస్టేబుల్‌కు కాలికి గాయాలయ్యాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరో మహిళా కానిస్టేబుల్‌తోపాటు, ఎస్సై పైనా షర్మిల చేయి చేసుకున్నారని కోర్టుకు వివరించారు.
అటు షర్మిల తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా షర్మిలను అడ్డుకున్నారన్నారు. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. షర్మిలను పోలీసులు బయటకి అనుమతించడం లేదని, ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఓ ఎస్సై తనను చేతితో తాకే ప్రయత్నం చేశారని షర్మిల కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చాలా మంది పోలీసులు తనను అడ్డుకొని చేయి విరిచే ప్రయత్నం చేశారని.. కొట్టే ప్రయత్నం కూడా చేసినట్లు చెప్పారు. నన్ను కొట్టారు. ఇక ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తొలుత తీర్పును రిజర్వ్ చేసింది. అనంతరం 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com