Nalgonda : మిర్యాలగూడలో భారీ భూ కబ్జా..

Nalgonda : మిర్యాలగూడలో భారీ భూ కబ్జా..
X
Nalgonda : నల్లగొండ జిల్లా పరిధిలో భారీ భూ అక్రమ వ్యవహారం బట్టబయలైంది

Nalgonda : నల్లగొండ జిల్లా పరిధిలో భారీ భూ అక్రమ వ్యవహారం బట్టబయలైంది. మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని దామరచర్ల మండలం రాజుగుట్ట తండాలోని 160 ఎకరాల విలువైన భూమిని ఓ బడా కంపెనీకి అప్పజెప్పేందుకు రెవెన్యూ ఉన్నతాధికారి, ఓ స్థానిక ప్రజాప్రతినిధి పెద్ద ప్లానే చేశారు. ఇక్కడ ఎకరా 15 లక్షలు పలుకుతుండగా, ఈ మొత్తం భూమి విలువ 24 కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది.

50 ఏళ్ల క్రితం నాగార్జునసాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులకు ఈ ప్రాంతంలో భూములను అప్పగించారు. అయితే అప్పట్లో దట్టమైన అడవులు, చెట్లు ఉండడంతో వారంతా ఇక్కడికి రాకుండా అక్కడే ఉండిపోయారు. ఆ భూముల్లో కొందరు స్థానిక గిరిజనలు సాగు చేసుకుంటూ పంటలు పండిస్తున్నారు.

గత దశాబ్ద కాలంగా ఆ భూములకు పట్టాలు ఇవ్వాలంటూ ఎన్నోసార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు.. అయితే, అధికార పార్టీకి చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి అండతో రెవెన్యూ అధికారి ఈ భూములను ఓ బడా కంపెనీకి అడ్డదారిలో కట్టబెట్టేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేశారు.

జిల్లా కలెక్టర్ సంతకంతో ఆ భూములన్నీ బదలాయింపు అయ్యేలా పక్కా ప్లాన్ తో వ్యవహరించారు. అయితే.. గత కలెక్టర్ ఆ ఫైల్‌ను పక్కన పెట్టడం.. కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కూడా ఆ ఫైల్ ను క్షుణ్ణంగా పరిశీలించి వెనక్కి పంపారు. దీంతో అసలు బండారం బట్టబయలైంది.

పూర్తిస్థాయి భూ హక్కు పట్టాల కోసం గిరిజనులు పోరాటం చేస్తుంటే వారికి దక్కాల్సిన భూమిని ఓ కీలక ప్రజాప్రతినిధితో కలిసి మూడో కంటికి తెలియకుండా ఆ భూములను బడా కంపెనీకి బదలాయించేందుకు సదరు రెవెన్యూ అధికారి గట్టిగానే ప్లాన్‌ చేశాడు.. సదరు అధికారి బంధువులకు చెందిన స్టీల్‌ కంపెనీకి అనుకూలంగా సర్వే రిపోర్టులు ఇవ్వాలంటూ ఎమ్మార్వో, ఆర్‌ఐ, డీటీలపై సదరురెవెన్యూ అధికారి ఒత్తిడి తెచ్చినట్లుగా సమాచారం.. అయితే, కింది స్థాయి అధికారులు మాట వినికపోవడంతో వారిని బదిలీ చేసి వారికి అనుకూలంగా ఉండే అధికారులకు పోస్టింగ్‌ ఇచ్చుకుని తతంగాన్ని పూర్తిచేశాడు.

సర్వే నంబరు 826లోని 160 ఎకరాల భూమిని ఓ బడా కంపెనీ గతంలో కొనుగోలు చేసినట్లు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించాడు. వాటిన్నిటినీ సక్రమం చేయడం కోసం జిల్లా కలెక్టర్‌ వద్దకు ఫైల్‌ పంపారు. అయితే, ఈ ఫైల్‌ గత కలెక్టర్‌ టేబుల్‌ ముందుకు రాగా.. ఆయన బదిలీ కావడం, కొత్త కలెక్టర్‌గా వినయ్‌ కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టారు.. కొత్త కలెక్టర్‌ ఈ ఫైల్‌ను క్షుణ్ణంగా పరిశీలించి తేడాగా ఉండటంతో వెనక్కు పంపారు.. సదరు రెవెన్యూ అధికారికి చీవాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ అక్రమ భూదందా వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ సైతం ఆదేశించారు.

అయితే, ఈ భూ అక్రమ దందా వ్యవహారంలో తన పేరు బయటకు రాకుండా ఉండేందుకు సదరు ప్రజాప్రతినిధి అప్పుడే పైరవీలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇదంతా రెవెన్యూ అధికారుల మీదకు మలిపేలా.. తాను క్షేమంగా బయటపడేలా ఉన్నత స్థాయిలో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఉన్నతాధికారులు ఈ భూ సంతర్పణ వ్యవహారంపై ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.. విచారణలో అసలు సూత్రధారులను బయటకు తీస్తారో లేదంటే తూతూ మంత్రంగా ముగిస్తారో చూడాలి.

Tags

Next Story