TS: తెలంగాణలో ఇద్దరు ఈఎన్సీలపై వేటు

మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) చర్యలు ప్రారంభించింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక ఆధారంగా నీటిపారుదల శాఖ ప్రక్షాళనకు నడుం బిగించిన రేవంత్‌రెడ్డి (Revanth reddy) ప్రభుత్వం ఇద్దరు ENCలను తప్పించింది. ENC జనరల్ మురళీధర్‌రావును రాజీనామా చేయాలని ఆదేశించిన సర్కార్ రామగుండం ENC నల్లా వెంకటేశ్వర్లును బాధ్యతల నుంచి తొలగించింది. మరికొంతమంది ఇంజినీర్లపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. నీటిపారుదల శాఖలో ఇద్దరు కీలక సీనియర్ ఇంజినీర్ ఇన్ చీఫ్‌లను తప్పించింది. ENC జనరల్ మురళీధర్‌రావును రాజీనామా చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. రామగుండం ENC నల్లా వెంకటేశ్వర్లును తొలగిస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.
మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఇచ్చిన నివేదికను పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం... తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మురళీధర్, వెంకటేశ్వర్లు ఇరువురూ కూడా పదవీ విరమణ చేసిన అనంతరం కూడా ENCలుగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మురళీధర్ పదవీ విరమణ అయిన దశాబ్దం తర్వాత కూడా అదే బాధ్యతల్లో ఉన్నారు. మేడిగడ్డ ఆనకట్ట డిజైన్ మొదలు నిర్మాణం, నాణ్యత, నిర్వహణ ఇలా ప్రతి దశలోనూ లోపాలు ఉన్నాయని విజిలెన్స్ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. బాధ్యతగా వ్యవహరించాల్సిన ఇంజినీర్లు జవాబుదారీతనంతో నడుచుకోలేదని వ్యాఖ్యానించినట్లు సమాచారం. నిబంధనలు పాటించలేదని, నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారని, నిర్వహణ కూడా సరిగా లేదని చెప్పినట్లు తెలిసింది.
ప్రతి దశలోనూ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, సమస్యలు వెలుగులోకి వచ్చినప్పటికీ సరిగా స్పందించలేదని, విధి నిర్వహణలో పూర్తి అలక్ష్యం ఉందని ఆక్షేపించినట్లు సమాచారం. గుత్తేదారుతో జరిపిన ఉత్తర, ప్రత్యుత్తరాలు... ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలు సహా ఇతరత్రా విషయాల్లో ఇంజినీర్ల వైఖరిని విజిలెన్స్ తప్పుపట్టినట్లు తెలిసింది. ఇంజినీర్ ఇన్ చీఫ్‌లతో పాటు పనులు పర్యవేక్షించిన పలువురు ఇతర ఇంజినీర్ల పేర్లను కూడా విజిలెన్స్ తన నివేదికలో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ఇద్దరు ENCలను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు ఔట్ లెట్ల అప్పగింత వ్యవహారంలో కూడా ENC జనరల్ మురళీధర్‌రావు వైఖరిపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్నట్లు నీటిపారుదల శాఖ వర్గాలు చెప్తున్నాయి. మిగిలిన ఇంజినీర్లపై కూడా త్వరలోనే చర్యలు ఉంటాయని అంటున్నారు. మొత్తంగా నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన జరగనుందని చర్చ జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com