Telangana: కల్తీ కల్లు కాటుకు ముగ్గురి బలి

మహబూబ్‌నగర్ జిల్లాలో కల్తీ కల్లు కాటేసింది. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన 42 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఈ ఘటన హాట్ టాపిక్‌గా మారి పొలిటికల్ టర్న్ తీసుకుంది.
అయితే బాధితులు చికిత్సకు వచ్చినప్పుడు కల్లు తాగిన ఆనవాళ్లు లేవని ప్రభుత్వాసుపత్రి డాక్టర్లు తెలిపారు. ఆల్కహాలిక్ విత్‌డ్రాయల్ సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేశామని, నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని చెప్పారు. ఈ నివేదిక రావడానికి మూడు వారాలు పడుతుందని, నివేదిక వచ్చిన తర్వాతే వారు కల్తీ కల్లు కారణంగా చనిపోయారా? లేదా? అన్న స్పష్టత వస్తుందని వివరించారు. ఘటనకు నిరసనగా బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలు నిర్వహించాయి.
కల్తీకల్లు ఘటనలకు బాధ్యత వహిస్తూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాజీనామా చెయ్యాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. జిల్లాలో కల్తీకల్లు ఏరులై పారుతోందన్నారు.. కల్తీ కల్లును వెంటనే అరికట్టాలన్నారు. లేకపోతే శ్రీనివాస్ గౌడ్ తన పదవికి రాజీనామా చెయ్యాలన్నారు. 45 రోజులుగా కల్తీ కల్లు బారిన పడి జిల్లాలో ఇద్దరు మృత్యు వాత పడితే మీడియాను, ప్రతిపక్షాలను ఆసుపత్రిలోకి అనుమతించకపోవడం దారుణమన్నారు.
మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరామర్శించారు. మృతులు కల్తీ కల్లు తాగి చనిపోలేదని వైద్యులు చెబుతున్నారని ఆయన తెలిపారు. కల్లు నమూనాలను ల్యాబ్‌కు పంపించామని, కల్తీ జరిగినట్లు తేలితే అధికారులు, కల్లు కాంపౌండ్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com