SLBC: కార్మికులను రక్షించేందుకు ముమ్ముర యత్నం

శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం వద్ద జరిగిన ప్రమాదంలో కూలీలను రక్షించేందుకు... ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ కూలీలకు సంబంధించిన ఆచూకీ లభించనట్లు తెలుస్తోంది. సొరంగంలో ఏర్పాటు చేసిన రింగ్‌లు కిందపడటంతో.. పైకప్పు కూలి ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల కోసం రక్షణ చర్యలు చేపట్టారు. సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఘటనా స్థలికి చేరుకుని సహాయకచర్యలు పర్యవేక్షిస్తున్నారు.
చిక్కుకుంది వీరే
తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామం వద్ద ఎస్ఎల్బీసీ సొరంగంలో ఈ ప్రమాదం జరిగింది. కార్మికులంతా ఉత్తర్ ప్రదేశ్, ఝార్ఖండ్, జమ్ముకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన వారుగా నీటి పారుదల శాఖాధికారులు చెబుతున్నారు. ఎస్ఎల్బీసీ టన్నల్ సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన వారిలో పంజాబ్ కు చెందిన గురుబిత్ సింగ్, జమ్మూ కాశ్మీర్ కు చెందిన సన్నిహిత సింగ్, ఉత్తరప్రదేశ్ కు చెందిన శ్రీనివాసులు, మనోజ్ రూపెన్, జార్ఖండ్ కు చెందిన సందీప్, సంతోష్, జట్కా ఇరాన్ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ప్రమాదంపై కేంద్రమంత్రి ఆరా
ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్లో ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరాతీశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని వీలైనంత త్వరగా బయటకు తీసుకురావాలని సూచించారు. ఇప్పటికే విషయం తెలుసుకున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెంటనే ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com