తెలంగాణలో పెరిగిన కరోనా కేసుల సంఖ్య..!

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గడిచిన 24 గంటల్లో 6వేల 876 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే కరోనా కారణంగా 59 మంది చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 2వేల 476కి చేరింది. తెలంగాణలో ఇప్పటి వరకు 4 లక్షల 63వేల 361 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 79వేల 520 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరోసారి వేయికి పైగా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే ఒకవేయి 29 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
తెలంగాణలో రెండు రోజుల విరామం తర్వాత వ్యాక్సినేషన్ మళ్ళీ మొదలైంది. టీకా కోసం జనం బారులు తీరారు. 45 ఏళ్లు నిండిన వారు ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుంటేనే టీకా ఇస్తున్నారు.45 ఏళ్లకు పైబడిన వారికి ఉచిత టీకాల పంపిణీలో భాగంగా మరో 4 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు రాష్ట్రానికి చేరుకున్నాయి. మరో 50 వేల కొవాగ్జిన్ డోసులు ఇవాళ రానున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో టీకాల కొరత కారణంగా వారం రోజులుగా పంపిణీ మందకొడిగా సాగుతోంది.
గత శని, ఆదివారాలైతే ప్రభుత్వ వైద్యంలో పంపిణీని పూర్తిగా నిలిపివేశారు. సోమవారం 200 కేంద్రాల్లో మాత్రమే వ్యాక్సినేషన్ జరిగింది. తాజాగా 4 లక్షల డోసులు చేరడంతో.. వాటిని సోమవారం రాత్రికే అన్ని జిల్లాలకూ ప్రత్యేక వాహనాల ద్వారా తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com