Mulugu: ఏటూరునాగారంలో భారీ ఎన్‌కౌంటర్‌

Mulugu: ఏటూరునాగారంలో భారీ ఎన్‌కౌంటర్‌
X
ఏడుగురు మావోయిస్టులు మృతి...అన్నంలో విష ప్రయోగం జరిగిందన్న పౌరహక్కుల కమిటీ

ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం చల్పాక అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్‌, యాంటీ మావోయిస్ట్‌ స్క్వాడ్‌ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టాయి. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలున్నట్లు తెలుస్తోంది. ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి భద్రు అలియాస్ పాపన్నతో పాటు అతడి దళ సభ్యలు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో కురుసం మంగు అలియాస్‌ భద్రు అలియాస్‌ పాపన్న (35), ఎగోలపు మల్లయ్య అలియాస్‌ మధు(43), ముస్సకి దేవల్‌ అలియాస్‌ కరుణాకర్‌(22), ముస్సకి జమున (23), జైసింగ్‌ (25), కిశోర్‌ (22), కామేశ్‌( 23) ఉన్నట్లు తెలుస్తోంది.

అన్నంలో విష ప్రయోగం..!

ములుగు జిల్లా ఏటూరునాగారం చల్పాక అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల కమిటీ స్పందిస్తూ ఓ లేఖ విడుదల చేసింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌పై పలు అనుమానాలున్నాయని.. మృతి చెందిన మావోయిస్టులకు అన్నంలో విష ప్రయోగం జరిగినట్లు స్థానిక ప్రజల ద్వారా తెలుస్తుందని పేర్కొంది. మృతదేహాలకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో శవ పరీక్ష నిర్వహించాలని, ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంవత్సరం కాలంలో 16 మందిని ఎన్‌కౌంటర్ల పేరుతో హతమార్చిందని హక్కుల సంఘం ఆరోపించింది.

కుట్ర జరిగింది

ములుగు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌లో కుట్ర జరిగినట్లు తెలంగాణ రాష్ట్ర కమిటీ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. అన్నంలో విష ప్రయోగం జరిగినట్లు తెలిపారు. మృతదేహాలకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో శవ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

బూటకపు ఎన్ కౌంటర్లు: హరీశ్ రావు

ములుగు ఎన్‌కౌంటర్‌పై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. కాంగ్రెస్ పాలనలో అరెస్టులు, ఆంక్షలు, బూటకపు ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయని విమర్శించారు. బూటకపు ఎన్‌కౌంటర్లు అశాంతిని రేపుతున్నాయని.. తెలంగాణ ప్రభుత్వం ఏడాది విజయోత్సవాలు నిర్వహిస్తుంటే ఈ పద్ధతి ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం అన్ని వర్గాలను మోసగించిందన్నారు. ప్రజాస్వామ్య పాలన అంటూ డబ్బా కొట్టి.. దానికీ తూట్లు పొడిచారని హరీశ్ సెటైర్లు వేశారు.

Tags

Next Story