Hyderabad: అక్షరం ముక్క రాదు.. అయినా అమెరికన్ యాక్సెంట్‌లో మాట్లాడుతున్న తెలుగు మహిళ

Hyderabad: కొన్ని వినడానికి విచిత్రంగానే ఉంటాయి. అక్షరం ముక్క రాదు.. అమెరికా అసలే తెలియదు. అయినా ధారాళంగా మాట్లాడేస్తోంది 70 ఏళ్ల తెలుగు మహిళ. వైద్యులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది ఈ సంఘటన. ఇలా ఎలా జరుగుతుందో స్పష్టత లేనప్పటికీ ఆమె ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్ (FAS) బారిన పడి ఉండవచ్చని వైద్య సంఘంలో ఊహాగానాలు మొదలయ్యాయి.
మెదడులో స్ట్రోక్ కారణంగా ఏర్పడిన అరుదైన రుగ్మత ఇది అని నగరంలోని సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు.
డాక్టర్ సుధీర్ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. " సంవత్సరం క్రితం, ఒక మహిళను ఆమె కొడుకు తీసుకువచ్చాడు. మా అమ్మకు ఏ జబ్బు లేదండి. కానీ ఈ మధ్య రోజూ ఉదయం నిద్రలేచినప్పటి నుండి అమెరికన్ యాసలో తెలుగు మాట్లాడటం ప్రారంభించింది. ఆమె నిరక్షరాస్యురాలు. పోనీ అమెరికాలో ఎవరైనా బంధువులు ఉన్నారా అంటే అదీ లేదు. ఎప్పుడూ వెళ్లనూ లేదు. మరి సడెన్‌గా ఈ మార్పేంటో అర్థం కావట్లేదు డాక్టర్ గారూ అని వివరించాడు తన తల్లి గురించి.
యాసలో ఆకస్మిక మార్పు అనేది నాడీ సంబంధిత సమస్య కావచ్చు. మెదడు యొక్క ప్రసంగ కేంద్రం దెబ్బతినడం వల్ల వస్తుంది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేస్తే సరిపోతుంది. మారిన యాస ఎక్కువ కాలం ఉంటుందని హెచ్చరించారు.
అతడి తల్లి చాలా నెలలు కోవిడ్‌తో బాధపడింది. దాని కారణంగా ఆమె అలా మాట్లాడుతుందేమోనని ఆమె కుమారుడు ఆమెను మానసిక వైద్యుని వద్దకు తీసుకెళ్లాడు. ఒత్తిడి వల్ల వచ్చి ఉంటుందని మానసిక వైద్యుడు వివరించాడు. కొన్ని రోజుల్లో తగ్గిపోతుందని చెప్పాడు. అయినా అమ్మలో మార్పు రాలేదని ఆమెను తీసుకుని న్యూరాలజిస్ట్ దగ్గరకు వచ్చాడు కొడుకు.
"పరీక్షలు ఆమె సమస్యను వెల్లడించాయి, పదాలను స్పష్టంగా ఉచ్చరించడంలో ఆమెకు ఇబ్బంది ఉంది. అమెరికా ఇంగ్లీషు యాసలో ఆమె తెలుగులో మాట్లాడుతున్నట్లు అనిపించింది. MRI పరీక్షలో మెదడు ఎడమ ఫ్రంటల్ ప్రాంతంలో ఒక చిన్న మార్పు చూపించింది అని డాక్టర్ పేర్కొన్నారు.
FAS అనేది ఒక అసాధారణమైన అనారోగ్యం, వృద్ధురాలికి చికిత్సలో భాగంగా వైద్యులు స్పీచ్ థెరపీ అందించారు, ఆరు నెలల తర్వాత ఆమె యాస క్రమంగా మామూలు స్థితికి వచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com