Telangana :ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Telangana :ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
X
‘మద్దతు’ కంటే తక్కువకు కొంటే చర్యలు: సీఎస్‌ శాంతికుమారి

ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 7 వేల 149 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రారంభం కాగా.. నాలుగైదు రోజుల్లో మిగతావన్నీ అందుబాటులోకి వస్తాయని CS వెల్లడించారు. వేసవిలో తాగునీరు సరఫరా పర్యవేక్షణ కోసం జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేకాధికారులను నియమించినట్లు శాంతి కుమారి పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ప్రజలు వడదెబ్బన బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను CS ఆదేశించారు.

రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం సర్కారు సన్నద్ధం అయ్యింది. అందు కోసం 7 వేల 149 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు CS శాంతికుమారి వెల్లడించారు. నాలుగైదు రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నీ ప్రారంభమవుతాయని ఆమె తెలిపారు. ఇప్పటికే ప్రారంభమైన పలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ప్రైవేట్ వ్యాపారులు కాంటాలు తెరిచి మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోళ్లు చేస్తే చర్యలు తీసుకోవాలని... కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, వేసవి జాగ్రత్తలు, నీటి సరఫరా, మన ఊరు మన బడి పనులపై కలెక్టర్లతో CS శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

రాష్ట్రంలో తాగునీటి సరఫరాను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేకాధికారులను నియమిస్తున్నట్టు CS శాంతికుమారి వెల్లడించారు. జిల్లాలో తాగునీరు సరఫరా పర్యవేక్షణ బాధ్యత స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లదేనని CS స్పష్టం చేశారు. మండలానికి జిల్లా స్థాయి అధికారి..వార్డు, గ్రామాలకు మండల స్థాయి అధికారిని నియమిస్తున్నట్టు చెప్పారు. ఎక్కడైనా మంచినీటి సరఫరాకు ఆటంకం ఏర్పడితే.. గ్రామాల్లోని వ్యవసాయ బావుల నుంచి అద్దె ప్రాతిపదికపై నీటిని సరఫరా చేయాలని లేదా ట్యాంకర్ల ద్వారా పంపించాలని శాంతికుమారి సూచించారు. నాగార్జునసాగర్ నుంచి పాలేరు జలాశయానికి తాగునీటి అవసరాల కోసం కృష్ణా జలాలను విడుదల చేశామన్నారు. మనఊరు -మనబడి కార్యక్రమం కింద అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనులన్నీ వెంటనే ప్రారంభించి పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.

రెండు నెలల పాటు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయన్న వాతావరణశాఖ హెచ్చరికతో.. వడదెబ్బ, డీ-హైడ్రేషన్‌పై ప్రజలను చైతన్యపరచాలని కలెక్టర్లకు సీఎస్ తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరడం, వడగాలులు వీచే అవకాశం ఉందని శాంతికుమారి పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు ORS ప్యాకెట్లు, ఐ.వీ ఫ్లూయిడ్లు, మందులను పంపించామని వాటిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో అందుబాటులో ఉంచాలని CS ఆదేశించారు. ఆశా కార్యకర్తలు, ఉపాధి హామీ పనుల కేంద్రాల వద్ద ORS పాకెట్లను అందుబాటులో పెట్టాలన్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు పిల్లలు, వృద్ధులు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని CS సూచించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఎండదెబ్బ బారిన పడకుండా ముందు జాగ్రత చర్యలను చేపట్టాలని కలెక్టర్లకు సీఎస్ స్పష్టం చేశారు.

Tags

Next Story