హ్యాట్సాఫ్ : ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఉచితంగా కటింగ్, షేవింగ్..!

ఉదార స్వభావంతో ఉపాధ్యాయులకు ఉచిత సేవలు అందిస్తున్నాడో సెలూన్ షాపు నిర్వాహకుడు. వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన బాలాజీ సెలూన్ షాపు యజమాని రాఘవేంద్ర కరోనా కష్ట కాలంలో బతుకీడుస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఉచితంగా కటింగ్, షేవింగ్ చేస్తున్నాడు. ఏడాది కాలంగా కరోనాతో జీవనోపాధి కోల్పోయి పూట గడవడమే కష్టంగా మారింది. దీంతో సెలూన్ షాపుకు వెళ్లాలన్నా భారమవుతోంది.
మంచి మనసు కలిగిన రాఘవేంద్ర ఉపాధ్యాయులకు ఉచితంగా కటింగ్, షేవింగ్ చేస్తున్నాడు. స్కూళ్లు తెరిచే వరకు సేవలు అందిస్తానన్నాడు. ఎంతోమంది ఆర్థికంగా ఉండి కూడా తమలాంటి వారికి చేయూత ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని వాపోతున్నారు ఉపాధ్యాయులు. కులవృత్తి చేసుకొని జీవనం సాగించే రాఘవేంద్ర తమలాంటి వారికి ఉచితంగా సేవలు అందిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ బాధలు చూసి ఆదుకోవాలని కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com