పార్కింగ్ ఏరియాలో నిద్రిస్తున్న చిన్నారి.. SUV వెహికల్ ఢీకొనడంతో..

హైదరాబాద్‌లోని అపార్ట్‌మెంట్ బేస్‌మెంట్‌లో నిద్రిస్తున్న 3 ఏళ్ల బాలిక, SUV ఢీకొనడంతో మరణించింది. ఈ ఘటన భవనంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ ఘటనపై గురువారం రాత్రి 10 గంటలకు చిన్నారి తల్లి 22 ఏళ్ల కవిత నుంచి ఫిర్యాదు అందినట్లు హయత్‌నగర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. జీవనోపాధి కోసం పిల్లలతో సహా హైదరాబాద్‌కు వచ్చినట్లు కవిత పోలీసులకు తెలిపారు.
బుధవారం ఉదయం 8 గంటలకు హయత్‌నగర్‌లోని లెక్చరర్స్ కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనంలో పని చేసేందుకు ఆ ప్రాంతానికి చేరుకున్నానని ఆమె తెలిపారు. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఆమె తన పిల్లలు, 6 సంవత్సరాల కుమారుడు బసవ రాజు, 3 సంవత్సరాల కుమార్తె లక్ష్మితో కలిసి భోజనం చేసింది. ఎండ వేడిని తట్టుకోలేక చిన్నారి లక్ష్మిని సమీపంలోని బాలాజీ ఆర్కేడ్ అపార్ట్‌మెంట్ సెల్లార్ లోని పార్కింగ్ ఏరియాలో పడుకోబెట్టానని తెలిపింది.
మధ్యాహ్నం 3 గంటల సమయంలో, పార్కింగ్ చేస్తున్న సమయంలో ఒక SUV తన కుమార్తె లక్ష్మిపైకి దూసుకెళ్లిందని, 3 ఏళ్ల బాలిక తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందిందని ఆమె పోలీసులకు తెలిపింది.
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. కర్ణాటకలోని గుల్బర్గాలోని షాబాద్ మండలానికి చెందిన కవిత కుటుంబం జీవనోపాధికై హైదరాబాద్ వచ్చింది. ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారిని పోగొట్టుకుని దు:ఖిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com