KTR: కేటీఆర్ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్

గ్రామాల్లో వివిధ సమస్యలతో జనం అవస్థలు పడుతుంటే ఎమ్మెల్యే మాత్రం అటువైపు తొంగిచూడడమే లేదని బీజేపీ గంభీరావుపేట మండల నేతలు కేటీఆర్ పై మండిపడుతున్నారు. కేటీఆర్ తీరుకు నిరసనగా తమ ఎమ్మెల్యే కనిపించడంలేదంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు కోడె రమేశ్ మీడియాతో మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సమస్యలు తిష్టవేశాయని, జనం నిత్యం సతమతమవుతున్నారని చెప్పారు. తమ అవస్థలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని వాపోయారు. తమ సమస్యలను పరిష్కరిస్తాడని నమ్మి ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే కేటీఆర్ మాత్రం అటువైపు చూడడమే లేదన్నారు.
గెలిచిన తర్వాత నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని విమర్శించారు. కేటీఆర్ కు రాజకీయంగా జన్మనిచ్చిందే సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలని గుర్తుచేసిన బీజేపీ నేత.. ఇప్పుడు ఆ నియోజకవర్గాన్నే కేటీఆర్ గాలికి వదిలేశాడని ఆరోపించారు. గంభీరావుపేట మండలం పరిధిలోని లింగన్నపేట వాగుపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మిస్తామంటూ గతంలో కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు ఆర్భాటం చేశారని చెబుతూ.. సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకూ బ్రిడ్జి మాత్రం పూర్తిచేయలేదన్నారు. ఈ క్రమంలోనే తమ ఎమ్మెల్యే నిత్యం తమకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com