sangareddy : రోడ్డున పడ్డ రైతు.. మా బియ్యం కొనండి బాబూ అంటూ..!

వీధి వీధి తిరిగి కూరగాయలు అమ్మడం తెలిసిందే. కానీ బియ్యం అమ్ముకోవడం ఎప్పుడైనా చూశామా...? కానీ, ఇప్పుడు రైతులే తాము పండించిన పంటను అమ్ముకోవడానికి రోడ్డున పడ్డారు. మా బియ్యం కొనండి బాబూ అంటూ ఇంటింటికీ తిరుగుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రోడ్డున పడ్డ రైతులపై టీవీ5 స్పెషల్ స్టోరీ...
రైతే రాజు... ఇది వినడానికి చక్కగా ఉన్నా, వారి పరిస్థితి దానికి రివర్స్. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రైతులు ఊసురుమంటున్నారు. తాము పండించన పంటను తామే అమ్ముకోవడానికి నడుం బిగిస్తున్నారు. కూరగాయల మాదిరిగా బియ్యాన్ని ఎడ్ల బండ్లపై వేసుకుని ఇళ్లిళ్లూ తిరుగుతున్నారు. వీధుల్లో బియ్యం అమ్ముకుంటున్నారు. బియ్యం అమ్ముడుపోయే వరకు అపరిశుభ్ర పరిసరాల్లోనే వారి వంటావార్పూ ఉంటోంది.
సమీపంలోని గ్రామాల రైతులు సంగారెడ్డి జిల్లా కేంద్రానికి ... ఇలా బియ్యాన్ని ఎడ్లబండ్లపై తీసుకువస్తున్నారు. ఇళ్లిళ్లూ తిరిగి బియ్యం అమ్ముతున్నారు. గత సంవత్సరం సన్నాలే సాగు చేయాలని ఆదేశించిన ప్రభుత్వం తగిన ధర ఇవ్వలేదు. కొనుగోళ్లూ అంతంత మాత్రమే. దళారుల సంగతి సరేసరి. ఈసారి వరి కొనుగోలు విషయంలో భారీ గందరగోళమే ఏర్పడింది. దీంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గం అన్వేషించారు. తామే వడ్లను బియ్యంగా మార్చుకుంటున్నారు రైతులు. వాటిని ఎడ్ల బండ్లలో సంగారెడ్డికి తీసుకొచ్చి నేరుగా వినియోగదారులకే అమ్ముకుంటున్నారు.
ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ వీధి వీధికి, ఇంటి ఇంటికీ తిరిగి బియ్యం అమ్ముతున్నారు. దీంతో రైతుకు లాభం జరుగుతోంది. వినియోగదారునికీ ఉపయోగం ఉంటుంది. నాణ్యమైన క్వింటాల్ బియ్యం నాలుగువేల లోపే వస్తుండడంతో వినియోగదారులూ ఆసక్తి చూపుతున్నారు. ఒకేసారి 30, 40 క్వింటాళ్ల బియ్యం తీసుకొస్తున్న రైతులు మూడు నాలుగు రోజులు పట్టణంలోనే ఉండి అమ్ముకుని ఇళ్లకు వెళుతున్నారు.
ఈ వర్షాకాలం సీజన్‌లో ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే లక్షా 10 వేల 268 ఎకరాల్లో వరి సాగు కాగా రెండు లక్షల 45 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వచ్చింది. దీంట్లో కొంత తాము తినడానికి ఉంచుకుని మిగతావి రైతులు అమ్మేస్తుంటారు. ఈసారి ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర ఇబ్బంది ఏర్పడడంతో రైతులు ఇలా ప్రత్యామ్నాయం ఎంచుకున్నారు.
యాసంగిలో వరి సాగు వద్దంటే వద్దని చెబుతోంది ప్రభుత్వం. రైతులు మాత్రం వరే పండిస్తామంటున్నారు. వీధి వీధి తిరిగి బియ్యం అమ్ముతున్న రైతులదీ అదే మాట. ఇతర పంటలు వేస్తే అడవి పందులు బతకనీయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వడ్ల కొనగోళ్లలో వచ్చిన ఇబ్బందులతో రైతులు కొత్త దారిని వెతుకున్నారు. కాస్తా ప్రయాసే అయినా... దళారులకు అమ్ముకున్నదానికంటే లాభమే వస్తోంది. మరోవైపు వినియోగదారులకు నాణ్యమైన బియ్యం తక్కువ ధరకే లభిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com